● సంరక్షణకు చర్యలు ప్రత్యేక కమిటీలు
● ఎఫ్‌టీఎల్ గుర్తింపునకు డిజిటల్ సర్వే
● జిల్లాలో మొదటి దశలో
606 చెరువుల గుర్తింపు
చెరువుల సంరక్షణకు అధికారులు నడుం బిగించారు. నీటి మట్టం గుర్తించి హద్దుల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. డిజిటల్ సర్వే నిర్వహించేందుకు రంగంలోకి దిగారు. జిల్లాలో ఇప్పటికే చెరువుల ఎప్‌టీఎల్ హద్దులను గుర్తించేందుకు మొదటి దశలో 606 నీటి వనరులను గుర్తించారు. ఒక్కో మండలంలో 30 చెరువుల వరకు సర్వే నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు. దీంతో చెరువుల ఎఫ్‌టీఎల్ కబ్జాలకు తెరపడనుంది.
– చిన్నశంకరంపేట(మెదక్)
పారిశ్రామిక ప్రాంతంగా గుర్తింపు పొందిన చిన్నశంకరంపేట, చేగుంట, మనోహరాబాద్, తూప్రాన్, నర్సాపూర్ పరిసర ప్రాంతాల్లో చెరువులు కబ్జాకు గురవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. మరో వైపు మెదక్, రామాయంపేట, చేగుంటతో పాటు పలు పట్టణాల్లో అక్రమంగా చెరువులు కబ్జా చేసి భవన నిర్మాణాలు చేపడుతున్న సంఘటనలు ఉన్నాయి. ముందుగా ఎఫ్‌టీఎల్ ప్రాంతంలో మట్టి నింపి తర్వాత నిర్మాణాలు చేపట్టిన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈక్రమంలోనే అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం డిజిటల్ సర్వే నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది.
పక్కాగా హద్దులు
జిల్లాలో మొదటి దశలో గుర్తించిన 606 చెరువులకు డిజిటల్ సర్వే నిర్వహించేందుకు అధికారులతో కూడిన కమిటీలను నియమించారు. ఇందులో తహసీల్దార్, రెవెన్యూ సర్వేయర్, ఇరిగేషన్ ఏఈ, అటవీశాఖ అధికారులతో కూడిన కమిటీ చెరువులను పరిశీలిస్తుంది. ముందుగా తహసీల్దార్ కార్యాలయంలో అందుబాటులో ఉన్న చెరువు నక్షతో పాటు గూగుల్ మ్యాప్ ఆధారంగా డిజిటల్ సర్వే నిర్వహిస్తున్నారు. ఎఫ్‌టీఎల్‌ను గురించి హద్దులు ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైతే శాశ్వతంగా చెరిగిపోకుండా హద్దులు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు.
కబ్జాలను అరికట్టేందుకే..
చిన్ననీటి వనరులను కాపాడేందుకు చర్యలు చేపడుతున్నాం. మండలస్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ ద్వారా సర్వే చేసి ఎఫ్‌టీఎల్ హద్దులను ఏర్పాటు చేస్తున్నాం. దీని ద్వారా చెరువుల కబ్జాలను అరికడతాం. వర్షాకాలంలో చెరువులకు నీరు చేరే లోపే మొదటి దశలో 606 చెరువుల ఎఫ్‌టీఎల్ గుర్తించి హద్దులు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం.
– శ్రీనివాస్‌రావు, ఈఈ ఇరిగేషన్, మెదక్


