టేక్మాల్(మెదక్): భద్రకాళీ సమేత వీరభద్రుడి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం మండలంలోని బొడ్మట్‌పల్లి గుట్టపై వెలసిన వీరభద్రుడి కల్యాణోత్సవంలో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ బస్వరాజ్, సర్పంచ్ అవినాష్, వైస్ చైర్మన్ ఈశ్వరప్పతో పాటు పలువురు సన్మానించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని హమీ ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ వీరభద్రుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపు నిర్వహించారు. కాగా బోడ్మట్‌పల్లి ఉన్నత పాఠశాలలో పదో తరగతి టాపర్‌గా నిలిచిన విద్యార్థిని వైష్ణవిని మంత్రి దామోదర సన్మానించి అభినందించారు.
సకాలంలో ధాన్యం
కొనుగోలు చేయాలి
కొల్చారం(నర్సాపూర్): రైతుల నుంచి సకాలంలో ధాన్యం కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని తుక్కాపూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని, ధాన్యం రవాణాలో ఇబ్బందులు తలెత్తకుండా లోడింగ్, అన్ లోడింగ్ వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆంజనేయులు, ఉప సర్పంచ్ రవీందర్, సీఈఓ నవీన్, బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్ గుప్తా, యువత అధ్యక్షుడు సంతోశ్‌రావు, గంగయ్య తదితరులు పాల్గొన్నారు.
మల్లన్న ఆలయంలో
భక్తుల రద్దీ
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మారుమోగాయి. ఆదివారం వేకువజామున నుంచే పుష్కరణిలో స్నానమాచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. కొంత మంది భక్తులు గంగరేణి చెట్టు వద్ద పట్నా లు వేసి, ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
7న మామిడి ఫలాల వేలం
ములుగు(గజ్వేల్): ములుగు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో ఈ నెల 7వ తేదీన మామిడి ఫలాలవేలం నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ బి.శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు ఉదయం 11 గంటలకు వేలం పాట ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. వేలంలో పాల్గొనేవారు పాటకు ముందుగానే రూ.5వేల నగదు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. వేలంలో నెగ్గిన వారు మొత్తంలో సగం డబ్బులను నగదుగా చెల్లించాలని, లేకుంటే అతని పాటను రద్దు చేసి రెండో వ్యక్తికి అనుమతిస్తా మని చెప్పారు. వేలంలో నెగ్గిన వారు మొత్తం డబ్బులు చెల్లించిన తర్వాతనే పంట కోసేందుకు అనుమతిస్తామని చెప్పారు. మామిడి వేలం కాలపరిమితి జూన్ నెల 15 వరకు ముగుస్తుందన్నారు.


