గతేడాది ఆగస్టు చివరి వారంలో కురిసిన వర్షాలకు జిల్లావ్యాప్తంగా 179 చెరువులు, కుంటలు దెబ్బతిన్నాయి. నీటి కాల్వలు, చెక్‌డ్యాంలు కొట్టుకుపోయాయి. ఈక్రమంలో రాష్ట్ర విపత్తు స్పందన నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్) నుంచి రూ. 2.7 కోట్లతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. పర్మనెంట్ మరమ్మతుల కోసం ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. అయినా ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదు. నెలరోజుల్లో వర్షాలు ప్రారంభం కానుండటంతో ఎప్పుడు మరమ్మతులు ఎప్పుడు చేస్తారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
– మెదక్‌జోన్
జిల్లావ్యాప్తంగా చెరువులు, కుంటలు 2 వేల పైచిలుకు ఉన్నాయి. గతేడాది ఆగస్టు చివరివారంలో కురిసిన భారీ వర్షాలకు వరదలు ముంచెత్తాయి. ఫలితంగా 179 చెరువులు, కుంటలకు నష్టం వాటిల్లింది. ఇందులో 139 నీటి వనరులకు చిన్నా, చితక నష్టం జరిగింది. దీంతో రూ. 2.7 కోట్ల ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధులతో వాటికి మరమ్మతులు చేశారు. మరో 40 పెద్ద చెరువులు, కాల్వలకు పర్మనెంట్ మరమ్మతులు చేస్తే తప్ప నీటిని ఆపలేమని ఇరిగేషన్ అధికారులు గుర్తించారు. ఇందుకోసం రూ.40 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అయితే కేవలం ఆరు చెక్ డ్యాంలకు మాత్రమే రూ. 2.76 కోట్లు మంజూరు చేశారు. ఈ లెక్కన ఇంకా 34 నీటి వనరులకు రూ. 37.24 కోట్లు విడుదల కావాల్సి ఉంది.
బీళ్లుగా మారిన పొలాలు
హవేళిఘణాపూర్ మండలం రాయినిపల్లి శివారులో రాయినిపల్లి ప్రాజెక్టు ఉంది. దీని ఆయకట్టు కింద రాయినిపల్లి, పాతూర్, తిమ్మానగర్, మక్తభూపతిపూర్, శివ్వాపల్లి, వెంకటాపూర్, మల్కాపూర్ గ్రామాల పరిధిలో అధికారికంగా 1,100 ఎకరాలకు సాగు నీరందుతోంది. అనధికారికంగా మరో 500 ఎకరాలకు నీరు అందిస్తోంది. కాగా వర్షాకాలంలో ఎగువ నుంచి వచ్చిన వరదలకు కాలువలు పూర్తిగా కొట్టుకుపోయాయి. దీంతో ఇరిగేషన్ అధికారులు యాసంగిలో తాత్కాలిక మరమ్మతులు చేసి 25 శాతం పంటలకు మాత్రమే సాగు నీరు అందించారు. మిగితా 75 శాతం పొలాలు బీళ్లుగానే ఉన్నాయి. తెగిన కాల్వలకు పర్మనెంట్‌గా మరమ్మతులు చేయాలంటే రూ.2.33 కోట్లు అవసరం ఉంటుందని ప్రతిపాదనలు పంపగా, ఇప్పటివరకు పైసా మంజూరు కాలేదు. వెంటనే మరమ్మతులు చేయకుంటే వర్షాకాలంలోనూ పొలాలు బీళ్లుగానే ఉంటాయి. ఇది ఒక్క రాయినిపల్లి ఆయకట్టే కాదూ జిల్లాలో అనేక నీటి వనరుల పరిస్థితి ఇలానే ఉంది.
కాలువకు తాత్కాలిక మరమ్మతులు
అధ్వానంగా రాయినిపల్లి ప్రాజెక్టు కాలువ
ప్రతిపాదనలు పంపాం
గతేడాది కురిసిన భారీ వర్షాలకు 40 చెరువులు తెగిపోయాయి. వాటికి పర్మనెంట్ మరమ్మతుల కోసం రూ. 40 కోట్ల ప్రతిపాదనలు పంపించాం. కేవలం 6 చెక్‌డ్యాంల మరమ్మతుల కోసం రూ. 2.75 కోట్లు మంజూరయ్యాయి. వాటికి టెండర్ పెట్టాం. మిగితా వాటికి నిధులు మంజూరు కావాల్సి ఉంది.
– శ్రీనివాసరావు,
ఈఈ ఇరిగేషన్
మరమ్మతులకు నోచుకోని నీటి వనరులు, కాల్వలు
రూ.40 కోట్లతో ప్రతిపాదనలు
పూర్తిస్థాయిలో విడుదల కాని నిధులు
సమీపిస్తున్న వానాకాలం


