దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల ఆహ్వానం

May 3 2026 10:22 AM | Updated on May 3 2026 10:22 AM

కౌడిపల్లి(నర్సాపూర్‌): ఎంజేపీ (మహాత్మా జ్యోతిబాపూలే) బీసీ గురుకుల కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్‌ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్‌ హరిబాబు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులు అయిన విద్యార్థులు ఈనెల 12వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపులతో పాటు ఎంఎల్‌టీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ వృత్తి విద్య కోర్సులు సైతం అందుబాటులో ఉన్నాయన్నారు. జి ల్లాలో మూడు బాలుర, మూడు బాలికల కళాశాలలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. టెన్త్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్‌ ప్రకారం సీటు కేటాయిస్తామన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

పంటల సాగుపై అవగాహన

కౌడిపల్లి(నర్సాపూర్‌): నేల బాగుంటేనే మంచి దిగుబడి వస్తుందని పీజేటీఏయూ శాస్త్రవేత్త డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని భుజిరంపేటలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో పాల్గొని పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. రసాయన ఎరువులు అధికంగా వాడటంతో నేల ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పారు. నేల ఆరోగ్యం కోసం పచ్చిరొట్ట జీలుగు, జనుముతో పాటు జీవన ఎరువులు వాడాలన్నారు. మోతాగుకు మంచి రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడొద్దని చెప్పారు. అనంతరం డాక్టర్‌ విజయలక్ష్మి మాట్లాడుతూ.. వరికి బదులుగా పెసర, మినుము, కంది, వేరుశనగ తదితర పంటలు సాగు చేయాలన్నారు. పంటల మార్పిడితో మంచి ఫలితాలు వస్తాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శ్రీనివాస్‌, ఉసర్పంచ్‌ గోపాల్‌, ఏఓ స్వప్న, ఏఈఓ గౌతమి, రైతులు పాల్గొన్నారు.

ఇబ్బందులు తలెత్తొద్దు

వెల్దూర్తి(తూప్రాన్‌): కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని తూప్రాన్‌ ఆర్డీఓ జయచంద్రారెడ్డి సిబ్బందికి సూచించారు. శనివారం మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. తేమ శాతం అనుకూలంగా ఉంటే వెంటనే ధాన్యం తూకం వేసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట రెవెన్యూ సిబ్బంది, రైతులు ఉన్నారు.

‘నీట్‌’కు భారీ బందోబస్తు

మెదక్‌జోన్‌: నీట్‌ పరీక్షకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ శ్రీనివాస్‌రావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం పట్టణ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. కేంద్రం నుంచి 500 మీటర్ల పరిధిలోని జిరాక్స్‌ కేంద్రాలను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూసివేయాలని ఆదేశించారు. ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

బండెనక బండి కట్టి..

అల్లాదుర్గం(మెదక్‌): మండలంలోని గడిపెద్దాపూర్‌లో మల్లికార్జున స్వామి జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఉత్సవాల్లో భాగంగా శనివారం జాతర ప్రధాన ఘట్టమైన ఎడ్లబండ్ల ప్రదక్షిణ ఆకట్టుకుంది. ఆయా గ్రామాల నుంచి వచ్చిన భక్తులు అందంగా అలంకరించిన తమ ఎడ్లబండ్లతో మల్లికార్జున స్వామి ఆలయం చుట్టూ బండ్ల ప్రదక్షిణ చేయించారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అల్లాదుర్గం ఎస్‌ఐ శంకర్‌ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement