టాస్క్‌ఫోర్స్ బృందాలతో నిత్యం తనిఖీలు ● కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్ కలెక్టరేట్: నకిలీ విత్తనాలను అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్ బృందాలతో తనిఖీలు చేపడతామని కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్, సీడ్ కార్పొరేషన్ల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. నకిలీ విత్తనాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో ప్రస్తుతం 334 రిటైల్ విత్తన దుకాణాలు, 41 విత్తన ప్రాసెసింగ్ యూనిట్లు, 334 లైసెన్స్ కలిగిన విత్తన హోల్డర్లు ఉన్నారని తెలిపారు. రానున్న వానాకాలానికి అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, డీఏఓ దేవకుమార్, మెదక్, నర్సాపూర్, ఆర్డీఓలు, డీఎస్పీలు, తహసీల్దార్లు, సీడ్ కార్పొరేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ అకుల్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లా స్థాయి నుంచి గ్రామీణ ప్రాంతం వరకు కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతున్నట్లు తెలిపారు. వివిధ శాఖల జిల్లా అధికారులు సమగ్ర కార్యాచరణను వివరించారు. అనంతరం వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్ ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించారు.
ఆస్పత్రి నిర్వాహకురాలికి నోటీసులు
తూప్రాన్: అర్హత లేకుండా వైద్యం చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాహకురాలికి డిప్యూటీ డీఎంహెచ్‌ఓ జ్ఞానేశ్వర్ శనివారం నోటీసులు జారీ చేశారు. 15 రోజుల వ్యవధిలో వైద్య చికిత్సలు చేసేందుకు కలిగిన అర్హత ధ్రువపత్రాలు జిల్లా వైద్యాధికారికి సమర్పించాలని సూచించారు. లేని పక్షంలో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణ కేంద్రంలో గత కొన్నేళ్లుగా ఎలాంటి వైద్య అర్హతలు లేకుండా శ్రీ భవాని ప్రథమ చికిత్స కేంద్రం పేరుతో సలీల వైద్యం చేస్తున్నారు. ఈ విషయంలో ఫిర్యాదుల మేరకు తనిఖీలు నిర్వహించి వైద్యం చేయవద్దని హెచ్చరికలు జారీ చేశారు.


