మెదక్ కలెక్టరేట్: కొత్త కనెక్షన్ ఇవ్వక.. పాత సిలిండర్ సకాలంలో అందక జిల్లాలోని గ్యాస్ వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నా కనీసం 4 రోజులు పడుతుందని వాపోతున్నారు. ఒక సిలిండర్ ఉండటంతో ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. మరో దాని కోసం దరఖాస్తు చేసుకున్నా డీలర్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 16 ఏజెన్సీలు
జిల్లాలో మొత్తం 16 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా, 3,85,201 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో గృహ వినియోగ కనెక్షన్లు 3,85,201 కాగా, కమర్షియల్ కనెక్షన్లు 828 ఉన్నాయి. సింగిల్ సిలిండర్ వినియోగదారులు 1,55,375, డబుల్ సిలిండర్ కస్టమర్లు 75,525 మంది ఉన్నారు. గతంలో బుక్ చేసిన ఒక్క రోజులోనే గ్యాస్ సిలిండర్‌కు ఇంటికి చేరేది. ప్రస్తుతం సుమారు 8 రోజులైన పడుతుంది. దీంతో ఒక్క సిలిండర్ ఉన్న వినియోగదారులకు తిప్పలు తప్పడం లేదు. ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగాలు, వ్యాపారాలు కోసం పట్టణాలకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, కొత్త కనెక్షన్లు, అదనపు సిలిండర్లు ఇవ్వడం లేదు. ప్రభుత్వం స్పందించి వెంటనే కొత్త కనెక్షన్లు ఇచ్చే లా చర్యలు తీసుకోవాలని పలువురు వినియోగదారులు కోరుతున్నారు. ఇదిలాఉండగా పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరాలో జాప్యం జరుగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.
కొరత తీరగానే ఇస్తాం
ప్రస్తుతం గ్యాస్ కొరత కారణంగా కొత్త కనెక్షన్లు, అదనపు సిలిండర్లు ఇవ్వడం లేదు. అందులో డొమెస్టిక్‌తో పాటు కమ ర్షియల్ సిలిండర్లు ఉన్నాయి. ప్రస్తుతం నెలకొన్న కొరత తీరగానే మళ్లీ కొత్త కనెక్షన్లు ఇస్తాం.
– నిత్యానంద్, జిల్లా సివిల్ సప్లై అధికారి
గ్యాస్ సిలిండర్ల సరఫరాలో జాప్యం
ఇబ్బంది పడుతున్న వినియోగదారులు
కొత్త కనెక్షన్లు ఇవ్వని ఏజెన్సీలు


