మున్సిపాలిటీల్లో ముందస్తు ఆస్తి పన్ను వసూలును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎర్లీబర్డ్ పథకాన్ని అమలు చేసింది. ఏప్రిల్ 1 నుంచి 30వ వరకు ఆస్తి పన్ను ముందస్తుగా చెల్లించిన వారికి 5 శాతం రాయితీ ప్రకటించింది. అయితే పట్టణవాసుల నుంచి స్పందన కరువైంది. కేవలం 14 శాతం మాత్రమే వసూలైంది. – మెదక్‌జోన్
జిల్లాలో మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట నాలుగు బల్దియాలు ఉండగా, వాటి పరిధిలో 2026–27 సంవత్సరానికి గానూ రూ.30.56 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉంది. కాగా ఎర్లీబర్డ్ పథకం ద్వారా చెల్లించిన వారికి పన్ను మొత్తంలో 5 శాతం రాయితీ ఇస్తామని అధికారులు విస్తృత ప్రచారం నిర్వహించారు. అయినా నెలరోజుల్లో కేవలం రూ.4.25 కోట్లు మాత్రమే వసూ లైంది. ఇంకా రూ.26.31 కోట్లు వసూలు కావాల్సి ఉంది. కాగా ముందస్తుగా చెల్లించిన వారికి రాయితీ సుమారు రూ.18 లక్షల పైచిలుకు వర్తించింది.
రూ. కోట్లలో పాత బకాయిలు
2026–27 సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని నాలుగు బల్దియాల్లో రూ. 30.56 కోట్లు పన్నుల రూపంలో ఆయా మున్సిపాలిటీలకు చెల్లించాల్సి ఉంది. అందులో రూ. 4.25 కోట్లు ముందస్తు పథకం ద్వారా వసూలు చేశారు. ఇవి కాకుండా పాతబకాయిలు భారీగా పేరుకుపోయినట్లు తెలుస్తోంది. జిల్లాలో అతిపెద్ద మున్సిపాలిటీ మెదక్‌లో పాత బకాయిలు రూ. 12 కోట్ల వరకు ఉన్నాయని, వాటిలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, ఆర్డీఓ, తహసీల్దార్, డీఎఫ్‌ఓ, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్, బీఎస్‌ఎన్‌ఎల్ తదితర ప్రభుత్వ కార్యాలయాల్లోనే రూ. 10.50 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. మిగితా రూ.1.50 కోట్లు బడా రాజకీయ నాయకులకు సంబంధించిన బకాయిలు ఉన్నట్లు సమాచారం. మిగితా మూడు బల్దియాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలిసింది.
చెల్లింపులు ఇలా..
మెదక్ మున్సిపాలిటీ పరిధిలో 13,219 ఇళ్లు, షాపులు ఉన్నాయి. ఎర్లీబర్డ్ పథకానికి 2,927 మంది ముందుకొచ్చి రూ.1.61 కోట్లు ముందస్తుగా పన్నులు చెల్లించారు. అలాగే తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో 6,922 ఇళ్లు ఉండగా, 894 మంది రూ. 97 లక్షలు చెల్లించారు. నర్సాపూర్‌లో 5,049 ఇళ్లు ఉండగా 1,210 మంది ముందుకొచ్చి రూ.1.50 కోట్లు చెల్లించారు. రామాయంపేట బల్దియాలో 5,668 ఇళ్లు, షాపులకు గానూ 829 మంది రూ. 16 లక్షలు మాత్రమే చెల్లించారు. మొత్తంగా నెలరోజుల వ్యవధిలో ఎర్లీబర్డ్ పథకం ద్వారా 14 శాతం మాత్రమే వసూలైంది.
బల్దియాల్లో ‘ఎర్లీబర్డ్’కు స్పందన కరువు
రూ.30.56 కోట్లకు రూ.4.25 కోట్లు మాత్రమే వసూలు
పేరుకుపోయిన బకాయిలు
జిల్లాలో ఇలా..
మున్సిపాలిటీ బకాయిలు(రూ.లో) వసూలు(రూ.లో)
మెదక్ 19.20 కోట్లు 1.61 కోట్లు
రామాయంపేట 2.01 కోట్లు 16 లక్షలు
నర్సాపూర్ 5.84 కోట్లు 1.51 కోట్లు
తూప్రాన్ 3.51 కోట్లు 97 లక్షలు


