జాతీయ రహదారులపై వన్యప్రాణుల రక్షణకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని రెండు హైవేలపై అండర్‌పాస్‌లు నిర్మించాలని నిర్ణయించింది. ఈక్రమంలోనే అధికారులు సర్వే నిర్వహించారు. ఏ ప్రాంతంలో అండర్‌పాస్‌లు నిర్మించాలనే విషయమై వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ మేరకు కేంద్ర అటవీశాఖకు రిపోర్టులు పంపించారు.
– రామాయంపేట(మెదక్)
గతేడాది జాతీయ రహదారి 44పై నార్సింగి మండల పరిధిలోని అటవీ ప్రాంతంలో రోడ్డు దాటుతున్న చిరుతను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా మృతిచెందింది. ఈసంఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆశాఖలో కదలిక తెచ్చింది. అలాగే నాలుగేళ్ల కాలంలో దుప్పులు, ఇతర జంతువులు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాతీయ రహదారులపై అండర్‌పాసుల నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఈమేరకు కేంద్ర అటవీశాఖతో పాటు రోడ్డు, భవనాలశాఖ అధికారులు, స్థానిక అటవీ అధికారులు సర్వే నిర్వహించారు. ఏ ప్రాంతంలో అండర్‌పాస్‌లు నిర్మించాలనే విషయమై వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి కేంద్ర అటవీశాఖకు నివేదించారు.
ఆరుచోట్ల నిర్మాణం
జిల్లాలోని 44వ నంబర్ జాతీయ రహదారి మనోహరాబాద్, తూప్రాన్, చేగుంట, మాసాయిపేట, నార్సింగి, రామాయంపేట మండలాల మీదుగా 55 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ రహదారిలో ఐదు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం ఉంది. మెదక్, ఎల్కతుర్తి మధ్య నిర్మించిన (765 డీజీ) జాతీయ రహదారిపై రామాయంపేట మండలం అక్కన్నపేట, లక్ష్మాపూర్ మధ్య ఐదు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. 44వ జాతీయ రహదారిపై వల్లూరు వద్ద ఒకటి, రామాయంపేట ప్రాంతంలో 2 అండర్‌పాసుల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు. 765 డీజీ రహదారిపై అక్కన్నపేట, లక్ష్మాపూర్ అటవీ ప్రాంతంలో, హవేళిఘణాపుర్ మండలం పాతూర్ అటవీప్రాంతం రాజేశుని గుట్ట వద్ద ఒక్కొక్కటి చొప్పున మొత్తం 3 అండర్ పాసుల నిర్మాణానికి గాను స్థలాలను ఎంపిక చేశారు.
వన్యప్రాణులు రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా చర్యలు
క్షేత్రస్థాయిలో పర్యటించిన అధికారులు
ఇప్పటికే పలు ప్రాంతాల గుర్తింపు
ప్రతిపాదనలు పంపాం


