కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్ కలెక్టరేట్: ఈనెల 3వ తేదీన నిర్వహించనున్న నీట్ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 479 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు చెప్పారు. ఇందుకోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశామని, అభ్యర్థులు హాల్‌టికెట్‌లోని నిబంధనలను పూర్తిగా అధ్యయనం చేసి అందుకు అనుగుణంగా పరీక్ష రాసేందుకు రావాలని సూచించారు. పరీక్ష కేంద్రం వద్ద 163 బీఎన్‌ఎస్ సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. అలాగే పరీక్ష మొత్తం సీసీ కెమెరాల నిఘాలో నడుస్తుందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.
అర్హత లేకున్నా వైద్యం
తూప్రాన్: ఎలాంటి అర్హతలు లేకుండా గర్భిణులు, మహిళలకు వైద్యం అందిస్తున్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిని ఇటీవల జిల్లా వైద్యాధికారులు సీజ్ చేశారు. అయినా నిర్వాహకురాలు యథేచ్ఛగా ఇంట్లో వైద్యం అందిస్తున్నారు. శుక్రవారం ప్రభుత్వ వైద్య సిబ్బంది ఆకస్మికంగా తనిఖీ చేసి పట్టుకున్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ జ్ఞానేశ్వర్ కథనం ప్రకారం.. పట్టణ కేంద్రంలో కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా శ్రీ భవాని ప్రథమ చికిత్సాలయం పేరుతో మహిళ వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. గత నెల 14న ఆస్పత్రిని తనిఖీ చేసి సీజ్ చేసినట్లు చెప్పారు. ఆస్పత్రి వ్యవహారంపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేసినట్లు తెలిపారు. దీనిపై విచారణ కొనసాగుతుందన్నారు. అయినా ఆస్పత్రి నిర్వాహకురాలు సలీల తన ఇంటినే ఆస్పత్రిగా మార్చుకొని వైద్య చికిత్స చేస్తున్నట్లు గుర్తించామన్నారు. జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.


