కౌడిపల్లి(నర్సాపూర్): రైతులు పంటల సాగులో సమతుల్య ఎరువులు వాడాలని పీజేటీఏయూ శాస్త్రవేత్త డాక్టర్ మహాదేవప్ప తెలిపారు. శుక్రవారం మండలంలోని జాజితండాలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో భాగంగా పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోతాగుకు మంచి రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడొద్దని సూచించారు. యూరియా, డీఏపీ అధికంగా వాడటం వల్ల భూసారం తగ్గుతుందన్నారు. భూసార పరీక్షల ఆధారంగా సమతుల్య జీవన, పచ్చిరొట్ట ఎరువులు వాడాలన్నారు. శాస్త్రవేత్తలు సూచించిన విత్తనాలతో పంటలను సాగుచేయాలని చెప్పారు. ఆయిల్‌పామ్ సాగుతో అధిక ఆదాయం పొందవచ్చని ఆయిల్‌పామ్ ఫీల్డ్ కోఆర్డినేటర్ శ్రీధర్ తెలిపారు. ప్రభుత్వం సబ్పిడీపై మొక్కలు డ్రిప్ సౌకర్యం కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఓ స్వప్న, ఏఈఓ నరేందర్, నాయకులు హరిలాల్, రైతులు పాల్గొన్నారు.


