ఎస్పీ శ్రీనివాసరావు
మెదక్‌జోన్: ఈవ్‌టీజింగ్‌పై ఉక్కుపాదం మోపా మని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్‌లో అమ్మాయిలను ఏడిపించే 8 మంది ఆకతాయిలపై కేసులు పెట్టడంతో పాటు, మరో 56 మందికి కౌన్సెలింగ్ ఇచ్చామని తెలిపారు. 40 అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. మహిళల, బాలికల భద్రత కోసం షీటీమ్స్ కట్టుదిట్టంగా పనిచేస్తుందని, వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా మహిళలను వేధించినా, ఉద్దేశపూర్వకంగా వెంబడించినా వెంటనే డయల్ 100. షీటీమ్ వాట్సాప్ నంబర్ 8712657963కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే బాల్య విహహాలపై 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.
అంగన్‌వాడీల పనితీరు భేష్
నర్సాపూర్ రూరల్: జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు ఆదర్శంగా ఉందని రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి వల్లేటి ప్రేమ్‌చంద్ అన్నారు. గురువారం మండలంలోని సఖి కేంద్రంతో పాటు రెడ్డిపల్లి అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. సఖి కేంద్రాన్ని ఆశ్రయించే బాధితులకు అత్యుత్తమ సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. రిజిస్టర్‌ను తనిఖీ చేసి కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాలింతలు, గర్భిణులు, చిన్నపిల్లలకు పోషక విలువలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారిణి హేమాభార్గవి, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
దళారులను నమ్మి
మోసపోవద్దు
నర్సాపూర్ రూరల్: దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ సుహాసినిరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని మూసాపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్‌ఐ సిద్దిరాంరెడ్డి, సర్పంచ్ గడ్డం మమత, డీసీసీ జిల్లా కార్యదర్శి రవీందర్, కొత్త నారాయణగౌడ్, మోహన్ దాస్, సాయి చరణ్ గ్రామస్తులు పాల్గొన్నారు.
నో స్టాక్
చిన్నశంకరంపేట(మెదక్): మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్‌లో మూడు రోజులుగా ఇంధన నిల్వలు నిండుకున్నాయి. పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో యాజమాన్యం నో స్టాక్ బోర్డును ఏర్పాటు చేసింది. అధికారులు ఇంధనానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. దీంతో వాహనదారులు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
‘అంకితభావంతోనే
మంచి ఫలితాలు’
మెదక్ కలెక్టరేట్: ఉపాధ్యాయుల అంకితభావం, నిరంతర సహకారం వల్లే మైనార్టీ రెసిడెన్షియల్ విద్యార్థినులు ఉత్తమ ఫలితాలు సాధించారని రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ సెక్రటరీ నయీమ్ అన్నారు. బుధవారం రాత్రి జిల్లా కేంద్రంలో సమ్మర్ క్యాంపు ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆటల పోటీలలో ప్రతిభ కనబర్చిన బాలికలకు బహుమతులు అందజేసి మాట్లాడారు. ప్రభుత్వ ప్రోత్సాహం, చేపడుతున్న పలు సంక్షేమ కార్యక్రమాలు విద్యార్థుల అభివృద్ధికి దోహదపడుతున్నాయని అన్నారు. అనంతరం మెదక్ మున్సిపల్ చైర్‌పర్సన్ రాధికను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సురేఖ, కౌన్సిలర్లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విజిలెన్స్ టీం సభ్యులు, విద్యార్థినులు పాల్గొన్నారు.


