● జిల్లా గ్రంథాలయంలో గైడెన్స్ హబ్ ● రేపటి వరకు కౌన్సెలింగ్ కార్యక్రమం
మెదక్ కలెక్టరేట్: బాలల భద్రత, రక్షణ, డ్రగ్స్ నివారణే లక్ష్యంగా జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో అడోలెసెంట్ సపోర్ట్, గైడెన్స్ హబ్‌ను ఏర్పాటు చేశారు. యువతకు మార్గదర్శకత్వం, మానసిక మద్దతు అందించేందుకు జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ, మహిళాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ హబ్ ద్వారా ఈనెల 2 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. యువతకు భద్రతతో కూడిన, గోప్యమైన, సమర్థవంతమైన కౌన్సిలింగ్ అందించడం ద్వారా వారు సరైన నిర్ణయాలు తీసుకునేలా చేయడం. యువతలో పెరుగుతున్న ఒత్తిడి, భావోద్వేగ సమస్యలు, డిజిటల్ ప్రభావం, చెడు అలవాట్లకు గురయ్యే ప్రమాదాల నుంచి రక్షించడం. సరైన మార్గదర్శకత్వం చేసి సమస్యలను గుర్తించి పరిష్కరించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.
ప్రధాన సేవలు
సెల్‌ఫోన్ వినియోగం, డిజిటల్ అలవాట్లపై మార్గదర్శనం చేయడం, భావోద్వేగ సంబంధాల సమస్యలపై కౌన్సెలింగ్. డ్రగ్స్, ధూమపానం, ఒత్తిడి నివారణ, కెరీర్‌పై మార్గదర్శనం, జీవన నైపుణ్యాలు నేర్పించడం, బాలల భద్రత, రక్షణపై సహాయం అందిస్తున్నారు. విద్యార్థుల నుంచి సమస్యలు తెలుసుకోవడంతో పాటు వాటిపై కౌన్సెలింగ్ సెషన్ షెడ్యూల్ ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైతే రిఫరల్ సిస్టం ద్వారా చైతన్య పరుస్తున్నారు. ఈ విషయమై డీడబ్ల్యూఓ హేమభార్గవి మాట్లాడుతూ.. ఈ హబ్ ద్వారా కౌన్సెలింగ్ పొందిన విద్యార్థుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. నిపుణుల మార్గదర్శకత్వంలో ఈనెల 2వ తేదీ వరకు శిక్షణ కొనసాగుతుందని చెప్పారు. యువత, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.


