ఖేడ్ అభివృద్ధి కోసం సీఎస్‌కు ఎమ్మెల్యే వినతి
నారాయణఖేడ్: ఖేడ్ అభివృద్ధి కోసం రూ.240 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుకు ఎమ్మెల్యే సంజీవరెడ్డి విజ్ఞప్తి చేశారు. సీఎస్ కె.రామకృష్ణారావు తమ బంధువుల వివాహ వేడుకలో పాల్గొనేందుకు గురువారం నారాయణఖేడ్‌కు వచ్చారు. స్థానిక ఆర్‌అండ్‌బీ శాఖ అతిథిగృహం వద్ద ఎమ్మెల్యే సంజీవరెడ్డి, సబ్ కలెక్టర్ ఉమాహారతి ఆయనకు ఘనస్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. అనంతరం అతిథిగృహంలో ఆయనతో ఎమ్మెల్యే సమావేశమై మనూరు మండలం రాయిపల్లి వద్ద మంజీరా నదిపై ఉన్న వంతెన బ్రిడ్జి కండ్యాంగా మార్చేందుకు రూ.125 కోట్లు, ఖేడ్ పట్టణంకు రింగు రోడ్డుకు రూ.70 కోట్లు, ఖేడ్‌లో ఏటీసీ కేంద్రానికి రూ.45 కోట్లు మంజూరు చేసే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయించాలని కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. వివాహ వేడుకల్లో ఖేడ్ మున్సిపల్ చైర్మన్ నగేశ్ షెట్కార్ రామకృష్ణారావును కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. పలు అభివృద్ధి పనులపై చర్చించారు.


