జిల్లాలో 96.63 శాతం ఉత్తీర్ణత | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో 96.63 శాతం ఉత్తీర్ణత

Apr 30 2026 8:55 AM | Updated on Apr 30 2026 8:55 AM

● రాష్ట్రస్థాయిలో 22వ స్థానానికి పరిమితం ● బాలురతో పోలిస్తే బాలికలదే పైచేయి

● రాష్ట్రస్థాయిలో 22వ స్థానానికి పరిమితం ● బాలురతో పోలిస్తే బాలికలదే పైచేయి

పదో తరగతి ఫలితాలు మళ్లీ నిరాశ పరిచాయి. 96.63 శాతం ఉత్తీర్ణణతో రాష్ట్రస్థాయిలో జిల్లా 22వ స్థానానికి పరిమితం అయింది. కాగా గతేడాదితో పోలిస్తే వెనుకబాటుకు గురి కాగా, బాలురతో పోలిస్తే బాలికలుపైచేయి సాధించారు. – మెదక్‌జోన్‌

జిల్లాలో ఈఏడాది మొత్తం 11,232 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. అందులో బాలురు 5,572, బాలికలు 5,660 మంది ఉన్నారు. వీరిలో బాలురు 5,331 మంది ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 5,522 మంది పాసయ్యారు. ఈ లెక్కన బాలురు 95.67 శాతం,బాలికలు 97.56 శాతం ఉత్తీర్ణతతో పైచేయి సాధించారు.

ఈ పాఠశాలలు టాప్‌

జిల్లావ్యాప్తంగా 12 రకాల పాఠశాలలు ఉండగా, వాటిలో బీసీ వెల్ఫేర్‌, రెసిడెన్షియల్‌ పాఠశాలలు పదో తరగతి ఫలితాల్లో ముందంజలో ఉన్నారు. బీసీ వెల్ఫేర్‌లో 99.28 శాతం, రెసిడెన్షియల్‌ విద్యార్థులు 99.26 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులు 98.89 శాతం ఉత్తీర్ణత సాధించి మూడో స్థానంలో నిలిచారు. అలాగే సోషల్‌ వెల్ఫేర్‌ 98.71, మోడల్‌ స్కూల్‌ 98.36, మైనార్టీ రెసిడెన్షియల్‌ 97.80, కేజీబీవీ 96.81, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు 96.31, ట్రైబల్‌ వెల్ఫేర్‌ 95.10, ఎయిటెడ్‌ 88.24, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 84.49, ఆశ్రమ స్కూల్స్‌ 72.73 శాతం ఉత్తీర్ణత సాధించాయి.

100% ఉత్తీర్ణత సాధించిన స్కూల్స్‌

పదో తరగతి పరీక్షలో బీసీ వెల్ఫేర్‌కు చెందిన 4 పాఠశాలలు, కేజీబీవీ 9, మోడల్‌ స్కూళ్లు 4, ప్రైవేట్‌ 25, రెసిడెన్షియల్‌ 1, మైనార్టీ రెసిడెన్షియల్‌ 1, ట్రైబల్‌ వెల్ఫేర్‌ 3, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు 77, సోషల్‌ వెల్ఫేర్‌ 2 పాఠశాలల చొప్పున మొత్తం 126 పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించారు.

జిల్లాలో ఇలా..

సంవత్సరం ఉత్తీర్ణత

2021 100 %

2022 93.45%

2023 90.84%

2024 92.9 %

2025 96.87%

2026 96.63 %

ఫలితమివ్వని ప్రత్యేక క్లాస్‌లు

పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించినా, ఆశించిన ఫలితాలు రాలేదు. గతేడాది అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక క్లాస్‌లు ఏర్పాటుచేశారు. జనవరి నుంచి మార్చి వరకు ఉదయం, సాయంత్రం గంట చొప్పున రోజుకు రెండు గంటల పాటు అదనపు తరగతులు నిర్వహించారు. ప్రభుత్వం అందించిన అభ్యాసదీపకలను విద్యార్థులకు అందించారు. అందులోని మెలకువలను ప్రతిరోజు నేర్పించారు. అలాగే ఫిబ్రవరి 1 నుంచి మార్చి 13 వరకు సాయంత్రం వేళ నెలన్నర పాటు నిత్యం సాయంత్రం వేళ స్నాక్స్‌ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement