పకడ్బందీగా ‘జనగణన’ | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా ‘జనగణన’

Apr 30 2026 8:55 AM | Updated on Apr 30 2026 8:55 AM

నిజాంపేట(మెదక్‌): జనగణన పకడ్బందీగా జరగాలని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ సిబ్బందికి సూచించారు. బుధవారం మండల కేంద్రంలో జనగణన తీరును పరిశీలించారు. జనగణను పూర్తిస్థాయిలో నిర్వహించి ప్రజల నుంచి పూర్తి సమాచారం రాబట్టలన్నారు. జనగణనలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలని సూచించారు. అనంతరం పీఎసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తూకం సరిగా వేయాలని, సజావుగా ధాన్యం కొనుగోలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాస్‌, డిప్యూటీ తహసీల్దార్‌ రమ్యశ్రీ, ఆ ర్‌ఐ ప్రీతి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

కో ఆప్షన్‌కు 36 నామినేషన్లు

నర్సాపూర్‌: మున్సిపాలిటీలో కో ఆప్షన్‌ పదవులకు 36 నామినేషన్లు దాఖలైనట్లు ఇన్‌చార్జి మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి తెలిపారు. నామినేషన్‌ దాఖలుకు బుధవారంతో గడువు ముగిసిందన్నారు. కాగా ప్రభుత్వం మైనార్టీలకు రెండు కో ఆప్షన్‌ పదవులు, ప్రత్యేక పరిజ్ఞానం, అనుభవం కలిగి ఉన్న వ్యక్తులకు రెండు వంతున పదవులు కేటాయించింది. మైనార్టీ వర్గానికి చెందిన అభ్యర్థుల నుంచి 17 నామినేషన్లు, ఇతర రిజర్వేషన్లకు సంబంధించిన వ్యక్తుల నుంచి 19 నామినేషన్లు వచ్చాయని చెప్పారు. కాగా గురువారం నామినేషన్లను స్క్రూటినీ చేస్తారని, వచ్చే నెల రెండు వరకు ఉపసంహరణకు గడువు ఉంటుందని వెల్లడించారు.

దరఖాస్తుల ఆహ్వానం

మెదక్‌జోన్‌: జిల్లా కోర్టులో ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూనియర్‌ అసిస్టెంట్‌ 1, స్టేనో టైపిస్ట్‌ 1 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. మే 1 నుంచి 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాగా జూనియర్‌ అసిస్టెంట్‌కు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ, స్టేనో టైపిస్ట్‌కు డిగ్రీతో పాటు ఇంగ్లీష్‌ షార్ట్‌ హ్యాండ్‌, టైప్‌ రైటింగ్‌ హయ్యర్‌ గ్రేడ్‌ ఉండాలన్నారు. ఇతర వివరాలకు జిల్లా కోర్టు వెబ్‌సైట్‌, నోటీస్‌ బోర్డులో చూసుకోవచ్చన్నారు.

మహిళా డిగ్రీ కళాశాల నిర్మాణానికి నిధులు

రామాయంపేట(మెదక్‌): అద్దె భవనంలో కొనసాగుతున్న మహిళా డిగ్రీ కళాశాల కం హాస్టల్‌ భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 4.19 కోట్లు మంజూరు చేసింది. జిల్లాలో ఏకై క కళాశాల ఇదే కావడంతో పాటు గతేడాది కురిసిన భారీ వర్షాలతో కళాశాల, హాస్టల్‌ భవనాల చుట్టూ వరద పోటెత్తింది. దీంతో అతి కష్టం మీద విద్యార్థినులను అక్కడి నుంచి తరలించారు. దీంతో పాటు ప్రస్తుతం కొనసాగుతున్న భవనంలో కనీస సదుపాయాలు సైతం కరువయ్యాయి. ఈ విషయమై ఎమ్మెల్యే రోహిత్‌ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన నిధులు మంజూరు చేయించారని కళాశాల ప్రిన్సిపాల్‌ శిరీష తెలిపారు. స్థల సేకరణ నిమిత్తం తహసీల్దార్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

ఆక్రమణదారులకు నోటీసులు

మెదక్‌జోన్‌: ‘చెరువులు చెరబడుతుండ్రు’ అని బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఇరిగేషన్‌ అధికారులు స్పందించారు. కబ్జా చేసిన బఫర్‌జోన్‌ను పరిశీలించారు. చెరువులో పోసిన మట్టితో పాటు అక్రమంగా నిల్వ ఉంచిన కలపను మూడు రోజుల్లో తొలగించాలని ఆదేశించారు. లేనిచో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈమేరకు అక్రమణదారులకు నోటీసులు జారీ చేశారు.

చదువుల్లో రాణించాలి

గజ్వేల్‌రూరల్‌: విద్యార్థులు చదువుల్లో రాణించినపుడే గుర్తింపు లభిస్తుందని సీపీడీసీ సభ్యులు అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సభ్యులు లక్ష్మణ్‌, నరేష్‌, గోపాల్‌రెడ్డి, సుభాష్‌చంద్రబోస్‌ తదితరులు మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement