● కొత్తగా రెండు నుంచి మూడు అసెంబ్లీ స్థానాలు!
● అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం
● దీంతో జిల్లాలో అసెంబ్లీ స్థానాల సంఖ్య నాలుగు నుంచి ఐదుకు పెరిగే అవకాశం!
మారనున్న నియోజకవర్గాల రూపురేఖలు
రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలు 17 నుంచి 26కు పెరిగే అవకాశాలున్నాయి. దీంతో మెదక్ లోక్‌సభ స్థానం స్వరూపం కూడా సమూలంగా మారనున్నాయని రాజకీయవర్గాలు విశ్లేషించుకుంటున్నాయి. మెదక్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో మెదక్, నర్సాపూర్, పటాన్‌చెరు, సంగారెడ్డి, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కాగా ఏయే అసెంబ్లీ స్థానాలు ఏ లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తాయనే దానిపై పునర్విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాత స్పష్టత రానుంది.
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మెదక్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల రూపురేఖలు సమూలంగా మారనున్నాయి. ఆయా నియోజకవర్గాల పరిధి, స్వరూపంలో కూడా మార్పులు రానున్నాయి. వాటి పరిధిలో మండలాల్లోను మార్పుచేర్పులుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెదక్ జిల్లాలో ప్రస్తుతం మెదక్, నర్సాపూర్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అలాగే అందోల్ నియోజకవర్గ పరిధిలో టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్ మండలాలున్నాయి. పెద్దశంకరం పేట మండలం నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానం పరిధిలో ఉంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జిల్లాలో వీటి సంఖ్య నాలుగు నుంచి ఐదుకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశంలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దిశగా కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. దీంతో జిల్లాలో కనీసం రెండు నుంచి మూడు కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగే అవకాశాలున్నట్లు రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
జనాభాను బట్టి..
2011 జనాభా లెక్కల ప్రకారం మెదక్ జిల్లా జనాభా 7.67 లక్షల జనాభా ఉంది. కాగా కేంద్ర ప్రభుత్వం మేలో జనగణన చేపట్టనుంది. 2027 మార్చి వరకు దేశవ్యాప్తంగా జనగణన పూర్తవుతుంది. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. 2027 జనాభా లెక్కల ప్రకారం ఎంత జనాభా పెరుగుతుంది? ఎంతమంది ఓటర్లుండే అవకాశాలున్నాయి? వీటి సంఖ్యను ఆధారంగా కొత్త నియోజకవర్గాలను ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ఆమోదించేందుకు అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో మహిళా రిజర్వుడు స్థానాలు కూడా ఉండే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


