దరఖాస్తులు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తులు పరిష్కరించాలి

Mar 25 2026 9:23 AM | Updated on Mar 25 2026 9:23 AM

భూభారతిపై కలెక్టర్‌ ప్రతిమా సింగ్‌

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలోని భూభారతి దరఖాస్తులను తహసీల్దార్లు చిత్తశుద్ధితో పరిష్కరించాలని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో భూభారతి, ప్రజావాణి పెండింగ్‌ దరఖాస్తులు, ఓటరు జాబితా తయారీపై రెవెన్యూ అధికారులతో మంగళవారం కలెక్టర్‌ వీడియో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ...రెవెన్యూ శాఖలో పారదర్శకత పాలన కోసం అధికారులంతా పాటు పడాలన్నారు. ప్రజావాణి, భూభారతి పెండింగ్‌ దరఖాస్తులు పరిష్కరించడంలో అలసత్వం వహిస్తే చర్యలకు వెనకాడబోమని తహసీల్దార్లను హెచ్చరించారు. ఓటర్‌ జాబితా తయారీ అన్ని శాఖల సమన్వయం చేసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురైతే ఉన్నతాధికారుల దృష్టికి తేవాలని సొంత నిర్ణయాలకు తావు లేదన్నారు.

సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేయండి

వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌పై కలెక్టర్‌ సమీక్షించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వ్యాప్తంగా తాగునీటి ఎద్దడి తీర్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందుకోసం అధికారులంతా సమన్వయంతో వేసవి కార్యచరణను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా నీటి ఎద్దడి తలెత్తిన వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్నారు. మిషన్‌ భగీరథ ఆర్‌డబ్ల్యూఎస్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సమిష్టిగా పని చేయాలన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో వన్య ప్రాణులకు దప్పిక తీర్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ నగేశ్‌, డీఎఫ్‌ఓ జోజి, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, డీపీఓ యాదయ్య, మిషన్‌ భగీరథ ఇంట్రాగ్రిడ్‌ ఈఈ సంపత్‌ కుమార్‌, గ్రిడ్‌ నాగభూషణం, సంబంధిత మున్సిపల్‌ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement