అదనపు కలెక్టర్ నగేశ్
మెదక్ కలెక్టరేట్: జనగణన–2027 తొలివిడతలో ప్రక్రియలో భాగంగా ఇళ్లలెక్కింపును ఎన్యూమరేటర్లు సమర్థవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ నగేశ్ స్పష్టం చేశారు. మెదక్ సమీకృత కలెక్టరేట్‌లో జనగణన అధికారులకు మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ...జనగణన విధులను అధికారులు సక్రమంగా నిర్వహించాలన్నారు. జనగణనలో సాంకేతిక వినియోగంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి యాప్ ద్వారా జనగణన చేయాలని తెలిపారు. తొలిసారిగా జనగణనను డిజిటల్ పద్ధతిలో చేస్తున్నట్లు వెల్లడించారు. మే 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు ఇళ్లగణన కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


