సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా
మెదక్ కలెక్టరేట్: జిల్లా సమగ్రాభివృద్ధికి బడ్జెట్‌లో నిధుల కోటా పెంచాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అడివయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ధర్నాచౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ర్యాలీ చేసి కలెక్టరేట్‌లో ఏఓ యూనస్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అడివయ్య మాట్లాడుతూ...ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అధికార యంత్రాంగం అలసత్వం వహిస్తుందని విమర్శించారు. భూ సమస్యలు, రోడ్ల మరమ్మతులు, నూతన రోడ్ల నిర్మాణం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు, ఉపాధి హమీ సమస్యలు ఎక్కడికక్కడ పేరుకు పోయాయని ఆరోపించారు. భూ సమస్యలు పరిష్కారం కాక ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ విసిగి పోతున్నారన్నారు. ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపు పేరుతో పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి శివారులోని రైతుల భూమి బ్లాక్ లిస్టులో పెట్టారని మండిపడ్డారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నర్సమ్మ, పద్మ, ఏ.మల్లేశం, కే.మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


