సమస్యల పరిష్కారానికే ప్రజాబాట : రమణారెడ్డి | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికే ప్రజాబాట : రమణారెడ్డి

Feb 1 2026 10:39 AM | Updated on Feb 1 2026 10:39 AM

సమస్య

సమస్యల పరిష్కారానికే ప్రజాబాట : రమణారెడ్డి

నర్సాపూర్‌ రూరల్‌: విద్యుత్‌ సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని విద్యుత్‌ శాఖ ఏడీ రమణారెడ్డి ప్రజలకు సూచించారు. శనివారం మండలంలోని అచ్చంపేటలో ప్రజాబాట కార్యక్రమం నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యలను వెంట వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అచ్చంపేటలో వేలాడుతున్న తీగలను సరి చేశామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ తుల్చమ్మ, నాయకులు భిక్షపతి, ఉప సర్పంచ్‌ నవీన్‌, విద్యుత్‌ సిబ్బంది ఉస్మాన్‌, ఆంజనేయులు, కృష్ణ, ప్రవీణ్‌, రాజకుమార్‌ పాల్గొన్నారు.

రూ. 21 లక్షల

పన్నులు వసూలు

నర్సాపూర్‌: మున్సిపాలిటీలో రూ. 21.39 లక్షల పన్నులు వసూలయ్యాయని మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీరాంచరన్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో పాటు వారిని ప్రతిపాదించిన వారు, సాక్ష్యులు తమ ఆస్తి పన్ను బకాయి ఉండరాదన్న నిబంధనల మేరకు పన్నులు చెల్లిస్తున్నారని చెప్పారు. ఈనెల 27 నుంచి 30 వరకు ఆస్తి పన్నులు, నల్లాల బిల్లుల వసూలు కోసం ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టామని కమిషనర్‌ వివరించారు.

పశు సంపద పెంచాలి

నర్సాపూర్‌ రూరల్‌: పశు సంపదను పెంచి రైతులను అభివృద్ధి చేసేందుకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి వెంకటయ్య తెలిపారు. శనివారం మండలంలోని గొల్లపల్లిలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని సందర్శించారు. పశువులకు గర్భకోశ వ్యాధులకు చికిత్స చేయడంతో పాటు కృతిమ గర్భధారణను పరిశీలించారు. దూడలకు నట్టల నివారణ మందులు వేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా పశు సంపదను పెంచేందుకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ మండల వైద్యాధికారులు డాక్టర్‌ సౌమిత్‌, డాక్టర్‌ స్వప్న, గొల్లపల్లి సర్పంచ్‌ లక్ష్మి, ఉప సర్పంచ్‌ రగుల శేఖర్‌ యాదవ్‌, గోపాలమిత్రలు రఘువీర్‌ శ్యామ్‌, వెంకటేశ్‌, ఏసుప్రభు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

టెట్‌ మినహాయింపు

ఇవ్వాలి: పీఆర్టీయూ

మెదక్‌జోన్‌: సర్వీస్‌ టీచర్లకు టెట్‌ ఉత్తీర్ణత మినహాయింపు ఇవ్వాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సతీశ్‌రావు డిమాండ్‌ చేశారు. టెట్‌ రద్దు కోరుతూ ఈనెల 5న నిర్వహించనున్న చలో ఢిల్లీ పోస్టర్‌ను శనివారం ఆవిష్కరించి మాట్లాడారు. విద్యా హక్కు చట్టం ప్రకారం 2009లోని సెక్షన్‌ 23ను సవరించి 2010కి ముందు ఉపాధ్యాయులుగా నియామకమైన వారికి టెట్‌ మినహాయింపు ఇవ్వాలన్నారు. ధర్నాకు జిల్లా నుంచి అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు సబాని శ్రీనివాస్‌, జిల్లా మాజీ అధ్యక్షుడు తాళ్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

వెంకటాపూర్‌ ఇన్‌చార్జి

హెచ్‌ఎం సస్పెన్షన్‌

నారాయణఖేడ్‌: మధ్యాహ్న భోజనం వికటించి 22 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలో పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం కాశీనాథ్‌పై ప్రభుత్వం వేటు వేసింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఘటన అనంతరం షోకాజ్‌ నోటీసు జారీచేసి వివరణ తీసుకోకుండానే సస్పెన్షన్‌ విధించడాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. పాఠశాల ఆవరణలో నిర్మించిన వంటగదిని గుత్తేదారు అప్పగించని కారణంగా మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు ఇంటివద్దే వండి పాఠశాలలో వడ్డిస్తున్నారని సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఓ ప్రకటనలో తెలిపారు.

సమస్యల పరిష్కారానికే ప్రజాబాట : రమణారెడ్డి
1
1/2

సమస్యల పరిష్కారానికే ప్రజాబాట : రమణారెడ్డి

సమస్యల పరిష్కారానికే ప్రజాబాట : రమణారెడ్డి
2
2/2

సమస్యల పరిష్కారానికే ప్రజాబాట : రమణారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement