మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వం ‘మహాలక్ష్మి’ పథకం ప్రారంభించిన తర్వాత ఆర్టీసీకి మహిళల తాకిడి విపరీతంగా పెరిగింది. అయితే వారి సంఖ్యకు అనుగుణంగా సర్వీసులు పెంచకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మెదక్ డిపో నుంచి ప్రధాన పట్టణాలకు వెళ్లే బస్సుల్లో అధికంగా ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. అయినప్పటికీ ప్రయాణికులకు సరిపోవడం లేదు. దీంతో రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో పల్లెవెలుగు బస్సులను నడిపిస్తున్నారు. వీటికి ముందు భాగంలో బ్లూ కలర్ రంగు వేసి ఎక్స్‌ప్రెస్ చార్జీలు వసూలు చేస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం లభించినప్పటికీ, తమకు చార్జీల భారం పడుతుందని పురుషులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 39 రూట్లలో బస్సులు
అసలే సీట్లు లభించక అవస్థలు పడుతూ ప్రయాణం చేస్తుంటే చార్జీల మోత మోగిస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ డిపో నుంచి సుమారు 39 రూట్లలో బస్సులు నడుస్తున్నాయి. ప్రతిరోజు సుమారు 40 వేల పైచిలుకు మహాలక్ష్మి (ఉచిత) టిక్కెట్లు వస్తున్నట్లు సమాచారం. మెదక్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్చారం మండల కేంద్రానికి ఆర్డీనరీ బస్సులో రూ. 20 ఉండగా, ఎక్స్‌ప్రెస్‌కు రూ. 40 వసూలు చేస్తున్నారు. పల్లె వెలుగు బస్సులకు రంగులేసి ఎక్స్‌ప్రెస్ చార్జీలు వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై డిపో మేనేజర్ సురేఖను వివరణ కోరగా.. ప్రయాణికులకు సరిపడా బస్సులు లేకపోవడంతో వారి సౌకర్యం కోసమే అలా నడిపించాల్సి వస్తుందని తెలిపారు. ఏదైనా వివరాలు కావాలంటే ఆర్టీసీ సీఐని సంప్రదించాలని సూచించారు. ఆయనను వివరణ కోరగా.. ఇతర డిపోలలో ఎక్కువగా ఉన్నాయని, మా డిపోలో మాత్రం కేవలం ఐదారు మాత్రమే ఉన్నాయన్నారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతి ఉందా? అని ప్రశ్నించగా అలాంటిదేమి లేదని చెప్పడం గమనార్హం.
బస్సులకు రంగులు వేసి చార్టీల వసూలు
వీరికి ఉచితం.. వారికి భారం


