2 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
● 11వ తేదీ వరకు నిర్వహణ ● ఏర్పాట్లు చేసిన అధికారులు
మెదక్ కలెక్టరేట్: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈనెల 2 నుంచి 11వ తేదీ వరకు రెండు విడతల్లో ఈ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ఈ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్ష లకు ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎంపీసీ, బైపీసీ విద్యార్థులతో పాటు ఒకేషనల్ కోర్సును అభ్యసిస్తున్న ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరగనున్నాయి. ప్రైవేట్ కళాశాలలో గల పరీక్ష కేంద్రాల్లో గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ప్రయోగ పరీక్షలను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలకు సూచించారు.
జిల్లాలో మొత్తం 12,323 మంది విద్యార్థులు
జిల్లాలో 27 ఇంటర్మీడియెట్ కళాశాలలున్నా యి. ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి రెండో సంవత్సరం విద్యను అభ్యసిస్తున్న వారికి మాత్రమే పరీక్షలుంటాయి. ఆన్‌లైన్ ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను కొన్ని ప్రైవేట్ కళాశాలలు ముందే లీకేజీ చేస్తున్నాయనే ఆరోపణలు రావడంతో పాటు ప్రాక్టికల్స్‌లో ఎటువంటి అవకతవకలు జరగకుండా వుండేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలకు అరగంట ముందే వన్ టైం పాస్‌వర్డ్ (ఓటీపీ) విధానంలో పరీక్ష కేంద్రం ఎగ్జామినర్‌కు ఆన్‌లైన్‌లో పంపుతారు. ఇందుకోసం ఎగ్జామినర్ సెల్‌ఫోన్‌కు మెసేజ్ రాగానే అతడు సంబంధిత వెబ్‌సైట్ నుంచి ప్రశ్నపత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకుని ఇన్విజిలేటర్లకు అందజేస్తారు. హాల్ టికెట్ ఆధారంగా ప్రశ్నపత్రం డౌన్‌లోడ్ చేసి ఇవ్వాల్సి వుంటుంది. పరీక్ష ముగించే గంట లోపు వాల్యుయేషన్ చేసి మార్కుల జాబితాను ఎగ్జామినర్ బోర్డుకు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.


