సరిహద్దులు కట్టుదిట్టం
● పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిఘా
● మద్యం, డబ్బు తరలింపుపై దృష్టి
● తనిఖీలు ముమ్మరం చేసిన పోలీస్‌శాఖ
జహీరాబాద్: పంచాయతీ ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా పోలీస్‌శాఖ రాష్ట్ర సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. కర్ణాటక నుంచి మన రాష్ట్రంలోకి వచ్చే 65వ జాతీయ రహదారిపై చిరాగ్‌పల్లి వద్ద, బీదర్ రహదారిపై హుసెళ్లి వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. డీఎస్పీ సైదా ఆధ్వర్యంలో సీఐ శివలింగం పర్యవేక్షణలో ఆయా పోలీస్‌స్టేషన్ల ఎస్‌ఐలు, సిబ్బంది చెక్‌పోస్టుల వద్ద ముమ్మరంగా తనిఖీలు జరుపుతున్నారు. జిల్లాలో ఈనెల 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, అక్రమాలు జరగకుండా బందోబస్తు ఏర్పా టు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒక్కో చెక్‌పోస్టులో పోలీసులతో పాటు ఆయాశాఖల సిబ్బందిని నియమించారు. అంతేకాకుండా ఆయా మండలాల్లోని ఎస్‌ఐలు తమ పరిధిలోని గ్రామాల్లో సిబ్బందితో కలిసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. డ్రంకెన్ డ్రైవ్‌లతో పాటు అక్రమాలపై నిఘా పెట్టారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు రూ. 50 వేల కంటే ఎక్కువ నగదును కలిగి ఉన్నా, అనుమతులు లేకుండా వస్తువులను తరలించినా చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. వాహనాల్లో వచ్చేవారు తగిన ధ్రువపత్రాలు కలిగి ఉండాలని సూచిస్తున్నారు. కర్ణాటకలో కొనుగోలు చేసి రాష్ట్రంలోకి తరలిస్తే బిల్లులు, పన్నులు చెల్లించిన పత్రాలు ఉండాలని పేర్కొంటున్నారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించాలని పోలీసులు ప్రజలను కోరుతున్నారు.


