
హత్య కేసు దర్యాప్తు వేగవంతం: ఎస్పీ
కొల్చారం(నర్సాపూర్)/మెదక్‌మున్సిపాలిటీ: పోతంశెట్టిపల్లి శివారులో శనివారం గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హత్యాచారం, హత్యకు గురైన మహిళ కేసును ఛేదించేందుకు దర్యాప్తు వేగవంతం చేసినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. సోమ వారం ఘటనాస్థలిని సందర్శించి మాట్లాడారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే సంబంధిత పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఎస్పీ వెంట మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి, ఎస్‌ఐ మోహినొద్దీన్, సిబ్బంది ఉన్నారు. అనంతరం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించిన ఎస్పీ ప్రజల నుంచి ఫిర్యాదులను నేరుగా స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలపై 11 ఫిర్యాదులను అందజేయగా, వాటిని స్వయంగా స్వీకరించి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. కొన్నింటిపై సంబంధిత పోలీస్‌స్టేషన్ల సీఐలు, ఎస్‌ఐలతో నేరుగా మాట్లాడి సమస్యల పరిష్కారానికి సూచనలు చేశారు.