
ఆయిల్‌పామ్ సాగుతో లాభాలు
ఏడీ సంధ్యారాణి
నర్సాపూర్ రూరల్: ఆయిల్‌పామ్ సాగుతో మంచి లాభాలు పొందవచ్చని నర్సాపూర్ వ్యవసాయ శాఖ ఏడీ సంధ్యారాణి రైతులకు సూచించారు. శుక్రవారం మండలంలోని తుజాల్‌పూర్‌లో ప్రసాద్‌రావు అనే రైతు పొలంలో ఆయిల్‌పామ్ మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం సబ్సిడీపై డ్రిప్పు అందజేయడంతో పాటు ఆయిల్‌పామ్ మొక్కలను కేవలం రూ. 20కే అందజేస్తుందన్నారు. నీటి సౌకర్యం సరిగా లేకుండా ఉన్న భూముల్లో సాగు చేసుకుంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి సాధించవచ్చని వివరించారు. కార్యక్రమంలో లీవ్ ఫామ్ రిసోర్స్ కంపెనీ టెక్నికల్ పర్సన్ అజయ్, ఏఈఓ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
కౌడిపల్లి(నర్సాపూర్): రైతులందరూ తప్పనిసరిగా పంటల నమోదు చేసుకోవాలని డీఏఓ దేవ్‌కుమార్ సూచించారు. శుక్రవారం మండలంలోని కన్నారంలో పంటల నమోదును పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ అధికారులు గ్రామాల్లో తిరిగి పంటల నమోదు చేస్తున్నారని తెలిపారు. క్షేత్రస్థాయిలో నమోదు ప్రక్రియ ను పరిశీలించినట్లు తెలిపారు. పంటల నమోదు ఆధారంగా కొనుగోలు కేంద్రాల్లో విక్రయాలు సులభంగా జరుగుతాయని వివరించారు. ఆయన వెంట ఏఓ స్వప్న, ఏఈఓ స్రవంతి ఉన్నారు.