
నిర్బంధాలు మాకు కొత్త కాదు
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి
మెదక్ మున్సిపాలిటీ: పోలీస్ నిర్బంధాలు మాకు, మా పార్టీకి కొత్త కాదని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి అన్నారు. ఆర్టీసీ చార్జీల పెంపును నిరసిస్తూ గురువారం పార్టీ ఛలో బస్ భవన్‌కు పిలుపునిచ్చింది. ఈనేపథ్యంలో బీఆర్‌ఎస్ నాయకుల ఇళ్ల ఎదుట భారీగా పోలీసులను మోహరించి ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఈసందర్భంగా పద్మారెడ్డి మాట్లాడుతూ.. పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో బస్సు చార్జీలు పెంచలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 22 నెలలకే చార్జీలు పెంచడం సరికాదన్నారు. ఉచిత బస్సు ప్రయాణం అంటూనే చార్జీలు పెంచడంతో సామాన్యలపై భారం పడుతుందన్నారు. బస్‌భవన్‌్‌కు వెళ్లకుండా ఆపడం కోసం ఇంతమంది పోలీసులను నాయకుల ఇళ్ల వద్దకు పంపారని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సు చార్జీలను వెనక్కి తీసుకునే వరకు నిరసన తెలుపుతూనే ఉంటామన్నారు. వినతిపత్రం ఇస్తామంటే హౌస్ అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ఇదేనా ప్రజాపాలన అని ప్రశ్నించారు.