
అన్నీ ఉన్నా.. అకాడమీ ఏదీ?
అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది మెతుకుసీమ పరిస్థితి. రూ. కోట్లు వెచ్చించి జిల్లా కేంద్రంలో నిర్మించిన సింథటిక్ ట్రాక్‌ను అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా అది వృథాగా మారింది. కానీ ట్రాక్ విషయం తెలుసుకున్న రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన ఆర్మీ అభ్యర్థులు 80 మందికిపైగా ఇక్కడికి వచ్చి శిక్షణ పొందుతున్నారు.
– మెదక్‌జోన్
జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 2000 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం అథ్లెటిక్స్ అకాడమీని ప్రారంభించి సింథటిక్ ట్రాక్‌ను మట్టితో నిర్మించింది. ఆ ట్రాక్‌పై ఎంతో మంది క్రీడాకారులు శిక్షణ పొంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. కాగా 2018లో సింథటిక్ ట్రాక్ నిర్మాణం కోసం రూ. 6.20 కోట్లు మంజూరయ్యాయి. ఆ నిధులతో ట్రాక్ నిర్మాణంతో పాటు అథ్లెటిక్స్ అకాడమీ భవన మరమ్మతులు, మరుగుదొడ్లు, కిచెన్‌షెడ్ తదితర పనులు చేశారు. కాగా నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు ఇక్కడ శిక్షణలో ఉన్న అథ్లెటిక్ క్రీడాకారులను హైదరాబాద్‌లోని గచ్చిబౌలికి పంపించారు. 2020లో నిర్మాణం పూర్తయినా, హైదరాబాద్‌కు తరలించిన అథ్లెటిక్స్ అకాడమీని తిరిగి రప్పించే విషయంలో అధికారులు, పాలకులు విఫలం అయ్యారు. ఫలితంగా రూ. కోట్లాది రూపాయలతో నిర్మించిన సింథటిక్ ట్రాక్ వృథాగా మారింది.
వెతుకుంటూ వచ్చారు
ఆర్మీ ఎంట్రెన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు హన్మకొండలో వచ్చే నెల 10 నుంచి 23వ తేదీ వరకు ఫిజికల్ ఈవెంట్స్ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా 1600 మీటర్ల రన్నింగ్, లాంగ్, హైజంప్ లాంటి టెస్టులు నిర్వహించనున్నారు. కాగా ఆయా జిల్లాలో శిక్షణ పొందేందుకు సింథటిక్ ట్రాక్ లేకపోవటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి 80 మందికిపైగా అభ్యర్థులు మెదక్ సింథటిక్ ట్రాక్‌పై గత కొన్ని రోజులుగా శిక్షణ పొందుతున్నారు.
శిక్షణలో భాగంగా రన్నింగ్ చేస్తున్న ఆర్మీఅభ్యర్థులు
మెదక్‌లో వృథాగాసింథటిక్ ‘ట్రాక్’
రూ. 6.20 కోట్లు వెచ్చించి నిర్మాణం
పట్టించుకోని పాలకులు
శిక్షణ పొందుతున్న ఆర్మీ అభ్యర్థులు
మా జిల్లాలో లేదు
మా జిల్లాలో సింథటిక్ ట్రాక్ లేదు. ఇక్కడ ట్రాక్ ఉందని తెలుసుకొని మా కోచ్‌తో పాటు ఇక్కడికి వచ్చి శిక్షణ పొందుతున్నాం. వచ్చే నెల 10 నుంచి ఆర్మీ ఈవెంట్స్ ఉన్నాయి. ట్రాక్‌పై శిక్షణ తీసుకోవటంతో ఈవెంట్స్‌లో రాణిస్తామనే నమ్మకం వచ్చింది.
– మమత, వనపర్తి జిల్లా
క్రీడాభివృద్ధికి కృషి చేయాలి
జిల్లా కేంద్రంలో సింథటిక్ ట్రాక్ నిర్మాణం పూర్తయి ఐదేళ్లు అవుతోంది. ట్రాక్ నిర్మాణంలో ఉండగా ఇక్కడి నుంచి అథ్లెటిక్ అకాడమీని హైదరాబాద్‌లోని గచ్చిబౌలికి తరలించారు. ఆ అకాడమీని తిరిగి రప్పించాలని ఎంతో మంది నేతలను వేడుకున్నాం. ఇప్పటికై నా ఉన్నతాధికారులు, పాలకులు స్పందించి అకాడమీని రప్పించి ఈ ప్రాంతంలో క్రీడా అభివృద్ధికి కృషి చేయాలి. – మధుసూదన్, అథ్లెటిక్ జిల్లా కార్యదర్శి