
అక్షరాస్యత దిశగా మహిళలు
చేగుంట(తూప్రాన్): మహిళా సంఘాల సభ్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు విద్యాశాఖ యాక్షన్‌ప్లాన్ రూపొందించింది. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పదో తరగతి చదువులు పూర్తి చేయించనుంది. ఇందుకోసం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గ్రామాల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు కేవలం ఏడో తరగతి వరకు మాత్రమే ఉంటాయి. ఈ కారణంతో గ్రామీణ ప్రాంతాల్లో బాలికలు ఏడో తరగతి లేదా పదో తరగతి వరకు మాత్రమే చదువు పూర్తి చేసుకునేవారు. ఈవిషయం క్షేత్రస్థాయిలో తెలుసుకున్న అధికారులు మహిళా సంఘాల సభ్యుల్లో ఏడో తరగతి పూర్తి చేసిన వారిని పదో తరగతి, పది పూర్తి చేసిన వారిని ఇంటర్ వరకు పరీక్షలు దూర విద్య ద్వారా రాయించేలా చర్యలు చేపట్టారు. చేగుంట మండలంలో 35 గ్రామైక్య సంఘాలు ఉండగా, 60 మందిని పదో తరగతి, 60 మంది ఇంటర్ పరీక్షలు రాయించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దూరవిద్య ద్వారా మహిళలు పదో తరగతి, ఇంటర్ పూర్తి చేస్తే స్వయం ఉపాధి కోసం సులభంగా రుణాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.