
గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి
గజ్వేల్: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. బుధవారం గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లికి చెందిన బీఆర్‌ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు బాల్‌రాజు, యూత్ ప్రెసిడెంట్ వెంకట్‌తోపాటు పలువురు నర్సారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నర్సారెడ్డి మాట్లాడారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సాహసోపేత నిర్ణయాలతో ముందుకుసాగుతున్నారన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రూ.2 లక్షల రుణమాఫీ, సన్న బియ్యం, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వంటి కార్యక్రమాలతో గ్రామీణ సమాజంలో పరివర్తనకు నాందిపలుకుతున్నారని చెప్పారు. గత బీఆర్‌ఎస్ పాలన పూర్తిగా అవినీతిమయంగా సాగిందన్నారు. బీఆర్‌ఎస్ చేసిన మోసాలను వివరిస్తూ ఢోకా కార్డుల పేరుతో ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సమన్వయంతో పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ సర్ధార్‌ఖాన్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.