
సన్నాల బోనస్ ఏమాయె!
ఆందోళనలో అన్నదాతలు
62,747 టన్నుల ధాన్యం విక్రయం
జిల్లాలో రూ.31.37 కోట్ల బకాయిలు
స్థానిక ఎన్నికలపై ప్రభావం
నాలుగు నెలలుగా ఎదురుచూపులు
దసరా పోయి దీపావళి వస్తున్నా.. సన్న వడ్లకు రావాల్సిన యాసంగి బోనస్ ఇంకా అందకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. బోనస్‌పై ఆశతో ఎన్నో కష్టనష్టాల కోర్చి సన్నాలు సాగు చేశామని, ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కన్నీళ్లే దిక్కవుతున్నాయని రైతులు చెబుతున్నారు. మరోవైపు స్థానిక ఎన్నికల వేళ బోనస్ బకాయిలు ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశీలకులుభావిస్తున్నారు – మెదక్ అర్బన్
మంజీరా తీరం.. వరి పంటలకు నిలయంగా విరాజిల్లుతోంది. చుట్టూర మంజీరా నది ప్రవ హిస్తుండటం.. ఘనపురం ఆనకట్ట కాలువల నీరు పంటలకు ప్రాణం పోస్తున్నాయి. జిల్లాలో గత యాసంగి సీజన్‌లో 3,19,144 టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యింది. అయితే సన్నాలకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని ప్రభు త్వం ప్రకటించింది. దీంతో 14,994 మంది రైతు లు 62,747 టన్నుల సన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. వీరికి బోనస్ రూపంలో రూ.31.37కోట్లు రావాల్సి ఉంది. మరికొంత మంది రైతులు సన్నాలు పండించినా వారి అవసరం మేరకు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకున్నారు.
నాలుగు నెలలైనా రాకపోవడంతో..
నాలుగు నెలలు కావస్తున్నా బోనస్ రాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే ప్రస్తుత సీజన్‌లో చాలా మంది సన్నాలు సాగు చేశారు. భారీ వర్షాలతో వేలాది ఎకరాల వరి పంట నీటమునిగింది. అయితే గత యాసంగి బోనస్ ఇప్పటి వరకు రాలేదని, ఇక ఖరీఫ్ సీజన్ బోనస్ ఎప్పుడు వస్తుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బోనస్ ప్రభావం
సా్థనిక ఎన్నికలపై సన్న వడ్ల బోనస్ ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దసరా పండుగ, ఎన్నికల నేపథ్యంలో బోనస్ ఇస్తారని అందరూ భావించారు. కానీ ఇప్పటి వరకు బోనస్ చెల్లింపులు జరగలేదు. దీంతో ఏ రైతు నోట విన్నా.. బోనస్ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అయితే స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్షాలు సైతం బోనస్ అంశాన్ని ప్రధాన అస్త్రంగా ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందు కోసం డాక్యుమెంటరీ చిత్రాలతో పాటు, సోషల్ మీడియా, పాటల సీడిలు, కళాబృందాలను ఉపయోగించి రైతులను ఆకట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించారు.
ఇప్పటికై నా ఇవ్వండి సారూ..
బోనస్ వస్తుందన్న ఆశతో యాసంగిలో రెండు ఎకరాల్లో సన్న వరి వేశాను. సుమారు రూ.17 వేల బోనస్ రావాలి. ఈ ఖరీఫ్‌లో వేసిన వరి పంట నీట మునిగింది. కష్ట సమయంలో కనీసం బోనస్ వస్తే కొంత ఉపశమనంగా ఉంటుంది. పండుగలకు ఉపయోగపడతాయి.
– కిషన్‌రెడ్డి, రైతు, పాపన్నపేట