
ఆశల పల్లకిలో..
ఎవరికి వారు.. ప్రయత్నాల జోరు
● అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు ● ఫైనల్ లిస్టు కోసం నిరీక్షణ
నర్సాపూర్: రిజర్వేషన్ల జీఓపై హైకోర్టులో కేసు ఉన్నందున స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఈ నేపథ్యంలో నర్సాపూర్ మండలంలో ఎంపీపీ, జెడ్పీటీసీ పదవుల కోసం ఆయా పార్టీల్లో పలువురు నాయకులు ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు పదవుల కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల్లో నాయకులు తమకే టికెట్ ఇవ్వాలని పోటీ పడుతున్నారు. కాగా బీసీ కేటగిరిలో ఉన్న ఎంపీటీసీ స్థానాలతో పాటు జనరల్ ఎంపీటీసీ స్థానం ఉన్న ప్రాంతాలకు చెందిన పలువురు ఆయా పార్టీల నాయకులు ఎంపీపీ అధ్యక్ష పీఠంపై దృష్టి పెట్టి పార్టీ అగ్ర నాయకుల వద్ద ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎంపీపీ అధ్యక్ష పదవి బీసీ జనరల్
నర్సాపూర్ ఎంపీపీ అధ్యక్ష పదవి బీసీ జనరల్‌కు కేటాయించబడింది. కాగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీపీ అధ్యక్ష పదవి కోసం రుస్తుంపేటకు చెందిన మాజీ సర్పంచ్ అశోక్, చిన్నచింతకుంటకు చెందిన మాజీ ఎంపీపీ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ తన భార్య అనురాధ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. కాగా బీఆర్‌ఎస్ నుంచి పార్టీ మండల శాఖ అధ్యక్షుడు బోగ చంద్రశేఖర్‌తో పాటు అదే పార్టీకి చెందిన ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ శివకుమార్ తన కుమారుడు సుదీప్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. ఇదిలాఉండగా బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు నగేశ్ భార్య నవనీత, పెద్దచింతకుంటకు చెందిన గుర్రాల వాణితో పాటు మరో నాయకుని పేర్లతో కూడిన జాబితాను బీజేపీ మండల శాఖ పార్టీ రాష్ట్ర అధిష్టానానికి పంపినట్లు తెలిసింది.
సందిగ్ధంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు
బీఆర్‌ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు బోగ చంద్రశేఖర్ ఎంపీపీ, జెడ్పీటీసీ పదవుల్లో ఏ పదవికి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఎంపీపీ అధ్యక్ష పదవి బీసీ జనరల్‌కు కేటాయించగా, జెడ్పీటీసీ బీసీ మహిళకు రిజర్వేషన్‌లో కేటాయించారు. కాగా ఎంపీపీ కోసం తాను ఎంపీటీసీగా పోటీ చేయాలా లేక జెడ్పీటీసీ పదవికి తన భార్య రాణిని పోటీలో నిలపాలా? అనే సందిగ్ధంలో ఉన్నాడని, తన మిత్రుల సలహాలు తీసుకుంటున్నాడని చెబుతున్నారు. ఇదిలా ఉండగా పార్టీ అధిష్టానం ఏ పదవికి పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తారోననే డైలమాలో సైతం ఉన్నట్లు తెలిసింది.
జెడ్పీటీసీకి ప్రయత్నాలు షురూ..
నర్సాపూర్ జెడ్పీటీసీ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ భార్య సంధ్యను పోటీలో నిలిపే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అదే పార్టీ నుంచి చిప్పల్‌తుర్తికి చెందిన కాంగ్రెస్ నాయకుడు సురేశ్‌గౌడ్ తన భార్య స్వప్నకు టికెట్ కోసం పార్టీ అధిష్టానం వద్ద ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిసింది. కాగా బీఆర్‌ఎస్ నుంచి మండలంలోని మూసాపేటకు చెందిన రవి తన భార్య సునీతకు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా బీజేపీ నుంచి ముగ్గురి పేర్లను మండల పార్టీ రాష్ట్ర అధిష్టానానికి పంపినట్లు తెలిసింది.