
రుణ లక్ష్యాలు సాధించాలి
మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వ ,ప్రైవేటు బ్యాంకర్లు నిర్దేశించిన రుణ లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ వివిధ బ్యాంకు అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్ నుంచి జిల్లాలోని పలు బ్యాంకుల అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది ఎక్కువగా వర్షాలు పడటం వల్ల ఖరీఫ్, రబీ సీజన్‌లో సమృద్ధిగా పంటలు పండే అవకాశం ఉందన్నారు. డిసెంబర్ కల్లా 80 శాతం రుణ లక్ష్యాలు సాధించాలన్నారు. వ్యవసాయం, పారిశ్రామిక, స్వయం సహాయక, ముద్ర, ఎంఎస్‌ఎంఈ, సూక్ష్మ, చిన్న , మీడియం ఎంటర్‌ప్రైజెస్‌లకు నిర్దేశించిన రుణాలను ఆర్బీఐ నిబంధనల మేరకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంకు మేనేజర్‌తోపాటు డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.
12 వరకు ఆర్టీఐ వారోత్సవాలు
జిల్లాలో సమాచార హక్కు చట్టం వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 5 నుంచి 12 వరకు వారోత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ వారంలో రెవెన్యూ డివిజన్లు, మండల ప్రధాన కార్యాలయాల్లోని అన్ని విభాగాల్లో నిర్వహించాలని చెప్పారు.
ఎన్నికలు పారదర్శకంగా జరగాలి
మెదక్‌జోన్: స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా జరగాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. త్వరలో నిర్వహించే మండల, జిల్లా ప్రాదేశిక ఎన్నికల బ్యాలెట్‌బాక్సులను పట్టణంలోని గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో భద్రపరచనున్న నేపథ్యంలో వాటిని మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...స్ట్రాంగ్ రూముల వద్ద భారీ భద్రతతోపాటు సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ వెంట జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, మెదక్ ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు తదితరులు ఉన్నారు.
బ్యాంకర్లకు కలెక్టర్ ఆదేశం