
ఇక సమరమే..
పల్లెల్లో ‘స్థానిక’ సందడి
● ముగిసిన రిజర్వేషన్ల ప్రక్రియ ● 42 శాతంతో బీసీలకు డబుల్ ధమాకా
పల్లెల్లో బతుకమ్మ, దసరా పండుగలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల సందడి కూడా కనిపిస్తోంది. మండల పరిషత్, జిల్లా పరిషత్ రిజర్వేషన్లు శనివారం సాయంత్రం ప్రకటించగా, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల
రిజర్వేషన్ల ప్రక్రియ అర్థరాత్రి వరకు కొనసాగింది. ఖరారు చేసిన రిజర్వేషన్లను జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి పంపించింది. బీసీలకు 42 శాతం అమలు చేయడంతో గతంతో పోలిస్తే సుమారు రెండింతల పాలకపక్షం పెరగనుంది. – మెదక్‌జోన్
జిల్లాలో 21 మండలాలతో పాటు 492 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 4,220 వార్డులు, 190 ఎంపీటీసీలు ఉండగా, 5,23,327 ఓటర్లు ఉన్నారు. జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించడంతో బీసీవర్గాల నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నా రు. గతేడాది జిల్లాలో 469 గ్రామాలు ఉండగా, పరిపాలన సౌలభ్యం కోసం 23 పంచాయతీలను కొత్తగా ప్రకటించారు. దీంతో వాటి సంఖ్య 492 చేరుకుంది. అలాగే మాసాయిపేట మండలాన్ని నూతనంగా ఏర్పాటు చేయడంతో మండలాల సంఖ్య 21కి చేరింది. గతంలో 189 ఎంపీటీసీలు ఉండగా, నూతన మండలం మాసాయిపేటతో కలిపి 190కి చేరుకుంది.
మారిన ముఖచిత్రం
2019లో జరిగిన సర్పంచ్ ఎన్నికలకు 2011 జనాభా లెక్కల ప్రకారం బీసీలకు 25 శాతం రిజర్వేషన్ అమలు చేశారు. అందులో భాగంగా 120 స్థానాలు ప్రకటించగా, ప్రస్తుతం 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ 179 స్థానాలను కేటాయించారు. ఈలెక్కన 59 స్థానాలు బీసీలకు అదనంగా పెరిగాయి. అలాగే ఎస్టీ 92 స్థానాలు, ఎస్సీ 77, అన్ రిజర్వుడ్(యూఆర్)కు 144 కేటాయించారు. వాటిలో మొత్తంగా మహిళకు 50 శాతం వాటా కల్పిస్తూ రిజర్వేషన్ ఫైనల్ చేశారు. అలాగే జిల్లావ్యాప్తంగా 190 ఎంపీటీసీలు ఉండగా, 2018లో జరిగిన ఎన్నికల్లో బీసీలకు 46 సీట్లు కేటాయించారు. ప్రస్తుతం 42 శాతం రిజర్వేషన్‌లో బీసీల వాటా కింద 79 సీట్లు కేటాయించారు. గతంలో పోలిస్తే 33 ఎంపీటీసీ స్థానాలు పెరిగాయి. అలాగే 2011 దమాషా ప్రకారం ఎస్టీకి 23, ఎస్సీ 34, అన్‌రిజర్వుడ్(యూర్)కు 54 చొప్పు న కేటాయించగా, అన్నివర్గాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించారు. మిగితావి పురుషులకు కేటాయించారు.

ఇక సమరమే..