
శోభాయమానం.. విద్యాధరి క్షేత్రం
● మహాచండీదేవిగా అమ్మవారు దర్శనం ● నేడు మూల మహోత్సవం
వర్గల్(గజ్వేల్): శంభునికొండ దేదీప్యమానమైంది. విద్యుత్ దీపాలతో వర్గల్ క్షేత్రం కాంతు లీనుతోంది. దసరాశరన్నవరాత్రి ఉత్సవాలో భాగంగా ఆదివారం అమ్మవారు మహాచండీదేవి అలంకారంలో భక్తజనావళికి దర్శనమిచ్చారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖరసిద్ధాంతి నేతృత్వంలో అమ్మవారికి మహాభిషేకం, రాజోపచార, షష్ట్యుపచార పూజలు నిర్వహించారు. భక్తజనులు అమ్మవారిని దర్శించుకుని తరించారు.
నేడు విశేషపూజలు, అక్షరస్వీకారాలు
ఉత్సవాలలో అత్యంత ప్రధానమైన మూల మహోత్సవానికి వర్గల్ క్షేత్రం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. సోమవారం అమ్మవారు సరస్వతీదేవిగా నిజరూప దర్శనమిస్తారు. రంగంపేట, పుష్పగిరి పీఠాధిపతులు మాధవానంద సరస్వతి, శ్రీవిద్యాశంకర భారతి స్వామి తదితర ప్రముఖులు హాజరు కానున్నారు. రోజంతా విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు పోటెత్తనున్నారు. భారీసంఖ్యలో చిన్నారుల అక్షరాభ్యాసాలు జరుగుతాయి. ఇందుకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

శోభాయమానం.. విద్యాధరి క్షేత్రం