
పర్యాటక ప్రాంతంగా బోరంచ
● మొదటి విడతగా రూ. 2 కోట్లు మంజూరు ● మంజీరా నదిలో బోటింగ్, ఇతర ఏర్పాట్లు
నారాయణఖేడ్: ఉమ్మడి జిల్లాలోనే ఏడుపాయల దుర్గామాత తర్వాత రెండో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన మనూరు మండలంలోని బోరంచ నల్లపోచమ్మ ఆలయం పర్యాటక ప్రాంతంగా అవతరించనుంది. పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా ఎకో టూరిజంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా బోరంచ వద్ద పర్యాటక ప్రాంత అభివృద్ధి కోసం తొలి విడతగా రూ. 2 కోట్లను విడుదల చేయనుంది. ఈమేరకు ఆర్థికశాఖ అనుమతులిచ్చింది. మరో రూ. కోటిన్నర నిధులకు ప్రతిపాదించారు. మంజీరా నదీ తీరాన బోరంచ ఆలయం ఉండటంతో బోటింగ్, పర్యాటకుల విడిదితో పాటు ఆలయంలో దర్శనం, ఇతర సౌ కర్యాలు ఏర్పాట్లు చేయనున్నారు. సంగమేశ్వర ఆలయం, రాఘవపూర్ సరస్వతీ అమ్మవారు, సూర్యదేవాలయం వరకు టెంపుల్ సర్కిల్‌గా మార్చి బోటింగ్ ఏర్పాట్లు చేయనున్నారు.
అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా..
ఆందోల్ నియోజకవర్గంలోని రాయిపల్లి మండలంలోని ఇందూర్ వద్ద మంజీరా నది గుట్టపై రిసార్ట్స్ ఏర్పాటుకు మంత్రి దామోదర రాజనర్సింహ ప్రతిపాదించారు. 12 కిలోమీటర్లు బోటింగ్ ద్వారా ప్రయణిస్తూ ఆలయాలను దర్శించుకోవడంతో పాటు రిసార్ట్‌ను కూడా వినియోగించుకునే అవకాశం కల్పించనున్నారు. అటవీశాఖ ద్వారా ఎకో టూరిజంకు రూ. 5 కోట్లు వెచ్చించి ఏర్పాట్లు చేసేందకు ప్రతిపాదించారు. ఎకో టూరిజంలో కాంక్రీట్ నిర్మాణాలు కాకుండా ఎకో ఫ్రెండ్లీ కాటేజెస్ నిర్మించనున్నారు. బాంబోస్టిక్స్‌తో కాటేజెస్ నిర్మాణం, రెస్టారెంట్లు సైతం ఇదే తరహాలో నిర్మించనున్నారు. బోరంచ ఆలయానికి సీజీఎఫ్ కింద రూ. 50 లక్షలు మంజూరయ్యాయి.
పీపీపీ మోడ్‌లో ఇతర ఏర్పాట్లు..
బోరంచలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) మోడ్‌లో వాటర్ ఫ్రంట్ హరిత రెస్టారెంట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. థీమ్ పార్క్, చిల్డ్రన్స్ ఏరియా, బొటానికల్ గార్డెన్ తదితర ఏర్పాట్లు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీమ్ కింద ఆలయాభివృద్ధికి నిధులకు ప్రతిపాదించారు. ఈ నిధులతో సంగమేశ్వరాలయం వద్ద ఉన్న మంజీరా నదిలో స్నానాలఘాట్, రహదారు లు, సాంస్కృతిక కార్యక్రమాలు, పర్యావరణానికి లోబడి ఇతర నిర్మాణాలు, డీర్ పార్క్ లాంటి ఏర్పాట్లకు ప్రయత్నాలు చేపట్టారు.