
ఎరువు..కునుకు కరువు
● అన్నదాతల పడిగాపులు
● పలుచోట్ల రాస్తారోకోలు.. ఆందోళనలు
మెదక్ అర్బన్: పగలనకా.. రాత్రనకా.. రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. ఆపై రోడ్లెక్కి రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. పలు చోట్ల పోలీసులు రంగ ప్రవేశం చేసి సముదాయిస్తున్నా రు. అయినా ఆందోళనలు ఆగడం లేదు. కష్టాలు తీరడం లేదు. సోమవారం మనోహరాబాద్, నార్సి ంగి, రామాయంపేట, శివ్వంపేటలో రైతులు రాస్తారోకోకు దిగగా.. నర్సాపూర్, పెద్దశంకరంపేట, చిన్నశంకరంపేట, కౌడిపల్లిలో భారీఎత్తున బారులు తీరారు. జిల్లాలో 3,37,359 ఎకరాల్లో పంటలు సా గుచేయగా, ఇప్పటివరకు 20 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినట్లు అధికారులు చెబుతున్నారు. త్వరలో మరో 6 వేల మెట్రిక్ టన్నులు జిల్లాకు వస్తుందని చెబుతున్నారు.
అప్పడు లేని కొరత ఇప్పుడెందుకు..!
గత ఖరీఫ్‌లో లేని యూరియా కొరత.. ప్రస్తుతం రైతన్నలను వేధిస్తుంది. అప్పట్లో జిల్లాలో 3.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయగా, ఆగస్టు వరకు 22 వేల మెట్రిక్ టన్నులు సరిపోయింది. మొ త్తం సీజన్‌కు 26వేల మెట్రిక్ టన్నులు వినియోగం అయింది. కానీ ఈసారి పంటలు తక్కువగా వేసినప్పటికీ, ఆగస్టు వరకు 22 వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేశామని, అయినా కొరత తీరడం లేదని అధికారులు చెబుతున్నారు. ఈసారి సమయానికి యూరియా రావడం లేదని, గోదాంలలో స్టాక్ లేకపోవడంతో రైతులు ఒకేసారి యూరియా కోసం ఎగబడుతున్నారని చెబుతున్నారు. జిల్లాలో 273 పాయింట్ల ద్వారా యూరియా సరఫరా చేస్తున్నారు. అయితే డిమాండ్‌కు అనుగుణంగా సరిపడా యూ రియా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పడరాని పాట్లు పడుతున్నా..
నాకున్న ఆరు ఎకరాలకు తోడు, మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నా. యూరియా కోసం ప్రతి రోజు పడరాని పాట్లు పడుతున్నా. ఎక్కడ యూరియా వచ్చిందంటే, అక్కడికి పరుగు తీస్తున్నా. సాయంత్రం వరకు పడిగాపులు కాసినా, సంచి దొరకడం లేదు. ప్రస్తుతం యూరియా వేసేందుకు అదను దాటిపోతుంది. – గొల్ల ఆంజనేయులు, రైతు, శివ్వంపేట
అవసరం మేరకు అందిస్తాం
యూరియా కోసం ఆందోళన వద్దు. అవసరానికి అనుగుణంగా మాత్రమే యూరియా తీసుకెళ్లాలి. రైతుల అవసరం మేరకు యూరియా సరఫరా చేస్తాం. త్వరలో మరో 6 వేల టన్నుల యూరియా వస్తుంది. వర్షాల నేపథ్యంలో కొంత జాప్యం జరుగుతుంది.
– దేవకుమార్, జిల్లా వ్యవసాయాధికారి