
స్థానిక పోరుకు సన్నద్ధం
నేడు వార్డుల వారీగా ఓటరు జాబితా
మెదక్‌జోన్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. గత నెల 29న పంచాయతీల వారీగా ముసాయిదాను విడుదల చేయగా, మంగళవారం తుది జాబితా ప్రకటించనున్నారు. అలాగే ఈనెల 6న ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఓటరు ముసాయిదా విడుదల చేయనున్నారు. 8న జిల్లా, మండలస్థాయి రాజకీయ నాయకులతో సమావేశం నిర్వహించి, 9న అభ్యంతరాల స్వీకరణ, 10న తుది జాబితా ప్రచురించనున్నారు. కాగా ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఈనెలలోనే స్థానిక నోటిఫికేషన్..!
సర్పంచ్‌ల పదవీకాలం ముగిసి 19 నెలలు కావొస్తుండగా, జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం ముగిసి 13 నెలలు అవుతోంది. పాలనాపరమైనా ఇబ్బందులు రాకుండా ఉండేందుకు జిల్లా పరిషత్‌కు ప్రత్యేక అధికారిగా కలెక్టర్, ఆయా మండలాల పరిషత్ కార్యాలయాలకు ప్రత్యేక అధికారులు కొనసాగుతున్నారు. ఈనేపథ్యంలో సెప్టెంబర్ 30 వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గడువు విధించిన నేపథ్యంలో ఈనెలలోనే నోటిఫికేషన్ వెలువడనున్నట్లు తెలిసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పాటు 50 శాతం రిజర్వేషన్లు మించరాదనే నిబంధనను ఎత్తివేసింది. ఆగస్టు 31న అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బిల్లుకు అన్ని పార్టీల మద్దతు లభించటంతో గ్రీన్ సిగ్నల్ లభించింది. కాగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ ప్రజాప్రతినిధుల సంఖ్య గతంతో పోలిస్తే రెండింతలు పెరగనుంది. అత్యధిక ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు బీసీల పరం కానుండగా, అధికంగా ఎంపీపీలతో పాటు జెడ్పీచైర్మన్ సైతం దక్కే అవకాశం ఉంది. కాగా జిల్లాలో 21 మండలాలు ఉండగా అందులో 42 శాతం బీసీల వాటాకు 8 మంది జెడ్పీటీసీలు, 8 ఎంపీపీలు, 190 ఎంపీటీసీలకు గానూ 79 ఎంపీటీసీలు దక్కే అవకాశం ఉంది.
ఏర్పాట్లు చేస్తున్నాం
ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారీగా ఓటరు ముసాయిదా జాబితాలను సిద్ధం చేసి ఆయా గ్రామ పంచాయతీలు, ఎంపీడీఓ కార్యాలయా ల్లో ప్రదర్శించనున్నాం. 8వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి వాటిని పరిష్కరించి తుది జాబితాను ఈనెల 10న విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.
– ఎల్లయ్య, జెడ్పీ సీఈఓ
6న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ముసాయిదా
9న అభ్యంతరాల స్వీకరణ
10న తుది జాబితా ప్రకటన