
వరద నష్టం నివేదిక అందించండి
కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్‌కలెక్టరేట్/పెద్దశంకరంపేట/టేక్మాల్: జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఏర్పడిన నష్టం నివేదికలను అధికారులు త్వరితగతిన సిద్ధం చేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా ఉన్నతాధికారులతో కలిసి హాజరయ్యారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పంట నష్టం, రోడ్లు, మిషన్ భగీరథ పైప్‌లు, విద్యుత్ లైన్ల నష్టం వివరాలను ఈనెల 10లోగా అందజేయాలని ఆదేశించారు. అలాగే వరదల కారణంగా చనిపోయిన బాధితులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన చెక్కులను సిద్ధం చేయాలన్నారు. అంతకుముందు దెబ్బతిన్న నార్సింగ్– పెద్దశంకరంపేట రోడ్డును పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే టేక్మాల్ మండలం వెంకటాపూర్‌లో దెబ్బతిన్న రోడ్డు, పంట పొలాలను పరిశీలించారు. కలెక్టర్ వెంట వివిధశాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు.