
బీసీలకే 42% రిజర్వేషన్లు ఇవ్వాలి
నర్సాపూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా 42% రిజర్వేషన్లు బీసీలకే ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీయాదవ్, పార్టీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక విలేకరులతో వారు మాట్లాడుతూ...ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అందులో ముస్లింలకు పది శాతం ఇవ్వడమెందుకని ప్రశ్నించారు. బీసీల రిజర్వేషన్లలో ముస్లింలకు ఇస్తే బీసీలను మోసం చేయడమేనని వారన్నారు. 42% రిజర్వేషన్లను బీసీలకే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కాగా, మొదటగా రాష్ట్ర మంత్రి మండలిలో బీసీల సంఖ్యను పెంచాలని మురళీయాదవ్, రమేశ్‌గౌడ్‌లు డిమాండ్ చేశారు. కాగా, స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించనందున గ్రామ పంచాయితీల పాలక కమిటీలు లేక కేంద్రం నుంచి వచ్చే నిధులు రాకుండా పోతున్నాయని, సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికలు పెట్టనందున నిధులు రావడం లేదని, సీఎం పరోక్షంగా గ్రామాల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సమావేశంలో పార్టీ నాయకులు సురేశ్, రాజేందర్, రమణరావు, నగేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.