
రవిరాజు.. బోధనలో రారాజు
● యూట్యూబ్ ఛానల్ ద్వారా గుర్తింపు ● ప్రపంచ స్థాయిలో ప్రశంసలు
నర్సాపూర్ రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద, మధ్య తరగతి విద్యార్థులకు వినూత్న రీతిలో నాణ్యమైన విద్యను అందించాలని సంకల్పించాడు మండలంలోని ఆద్మాపూర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రవిరాజు. అనుకున్నదే తడువుగా ఆట పాటలతో కూడిన విద్యను బోధిస్తూ ఆకట్టుకున్నాడు. దానిని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెరపైకి ఎక్కించి ఎప్పటికప్పుడు ప్రసారమాధ్యమాల్లో చేరుస్తున్నాడు. ప్రపంచస్థాయిలో అతని విద్యా విధానం చాలా మందికి నచ్చింది. యూట్యూబ్ ఛానల్‌కు ప్రశంసలు వచ్చాయి. కేంద్ర విద్యాశాఖ అధికారులు రవిరాజు ఏ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడో గుర్తించాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు. దీంతో రాష్ట్ర విద్యాశాఖ అధికారులు రవిరాజును సచివాలయానికి రావాల్సిందిగా సూచించారు. విద్యాశాఖ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నరసింహారెడ్డి ఇతర అధికారులు సన్మానించి ప్రశంసించారు.
నూతన భ వనం.. సకల వసతులు
అనంతరం మీరు పనిచేస్తున్న పాఠశాలకు ఏమి కావాలని రాష్ట్ర అధికారులు ఉపాధ్యాయుడు రవిరాజును అడిగారు. నూతన భవనం, మరికొన్ని సదుపాయాలు కల్పించాలని కోరారు. దీంతో వెంటనే కలెక్టర్ రాహుల్‌రాజ్‌కు ఫోన్ చేసి రవిరాజు పనిచేస్తున్న ఆద్మాపూర్ ప్రాథమిక పాఠశాలకు కావాల్సిన వసతులు కల్పించాలని, భవన నిర్మాణానికి కావాల్సిన అంచనా వివరాలను పంపించాలని ఆదేశించారు. ఇటీవల కలెక్టర్ రాహుల్‌రాజ్ స్వయంగా పాఠశాలకు వచ్చి పరిశీలించి రవిరాజును అభినందించారు. ఈసందర్భంగా ఉపాధ్యాయుడు మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి కష్టంతో కాకుండా ఇష్టంతో చదివించాలన్నదే తన లక్ష్యమన్నారు. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు తెలియకుండానే చదువుపై ఆసక్తి పెరిగేలా వినూత్న రీతిలో నాణ్యమైన విద్యా బోధనను ప్రారంభించానని చెప్పాడు. విద్యార్థులకు బోధించే తీరుపై యూ ట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచస్థాయిలో ప్రశంసలు రావడం ఆనందంగా ఉందని అన్నారు.