
ప్రజావాణిపై పట్టింపేది?
● అర్జీలు ఎక్కువ.. పరిష్కారం తక్కువ ● రెండేళ్లలో 19,667 వినతులు ● అధికారికంగా పెండింగ్‌లో 1,454 ● కాలయాపనతో నెలల తరబడిఫిర్యాదుదారుల నిరీక్షణ
మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి వినతులు పరిష్కారానికి నోచుకోవడం లేదు. వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తుంటే పదుల సంఖ్యలో మాత్రమే అధికారులు పరిష్కరిస్తున్నారు. దీంతో ఫిర్యాదుదారులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఏళ్ల తరబడి తిరుగుతున్నా సమస్యలు పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో కలెక్టర్ స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
భూ సమస్యలే అత్యధికం
కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో అత్యధికంగా భూ సమస్యలపైనే ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. పహణిలో తప్పుందని, పొలం పాస్ పుస్తకంలో ఎక్కాల్సి ఉందని, పట్టాదార్ పాస్ పుస్తకం రావడం లేదని, ఆన్‌లైన్‌లో భూమి కనిపించడం లేదని అర్జీలు అందజేస్తున్నారు. వీటితో పాటు తమ ఇంటి స్థలం, పొలం ఆక్రమించారని, దాయాదులు భూమిని కబ్జా చేస్తున్నారని ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్ల కోసం వినతులు అందజేస్తున్నారు. అయితే ప్రజావాణి దరఖాస్తులు ఒక్కటి కూడా పెండింగ్‌లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి ఫిర్యాదుదారులకు సమాధానం ఇవ్వాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ పదే పదే ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయినప్పటికీ పరిష్కారం కాక బాధితులు కలెక్టరేట్ చుట్టూ తిరిగి తిరిగి మనోవేదనకు గురవుతున్నారు.
ఆత్మహత్యాయత్నం చేసిన రైతు
ఇటీవల మెదక్ మండలం శమ్నాపూర్‌కు చెందిన యువరైతు పట్నం సురేందర్ కలెక్టరేట్ భవనం ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎన్నిసార్లు ఫిర్యాదు ఇచ్చినా అధికారులు సమస్య పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి తిరుగుతున్నా భూ సమస్య పరిష్కరించక పోగా అధికారులు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని వాపోయాడు. కాగా అదనపు కలెక్టర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించాడు. సంఘటన జరిగి నెలరోజులవుతున్నా.. ఇప్పటికీ సమస్య పరిష్కారానికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
(అధికారంగా కేవలం 1,454 అర్జీలు పెండింగ్‌లో ఉన్నట్లు చూపుతుండగా, భూముల సమస్యలు అత్యధికంగా ఉన్నట్లు సమాచారం)
ప్రజావాణి ఫిర్యాదులు ఇలా.. (అధికారికంగా రెండేళ్లలో)
కార్యాలయం అర్జీలు పరిష్కరించినవి పెండింగ్
కలెక్టరేట్‌లో 3,801 3,426 375
ఆర్డీఓ 999 951 48
తహసీల్దార్ 8,310 8,125 185
ఎంపీడీఓ 698 566 132
జిల్లా అధికారులకు 5,859 5,145 714

ప్రజావాణిపై పట్టింపేది?