
సాగునీటి నిర్వహణకు పటిష్ట చర్యలు
కొల్చారం(నర్సాపూర్)/చిలప్‌చెడ్(నర్సాపూర్): వేసవికాలంలో వరి పంటకు అవసరమైన నీటి నిర్వహణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని వరిగుంతం గ్రామంలో, అలాగే..చిలప్‌చెడ్ మండల పరిధిలోని చండూర్ శివారులో ఎండిపోయిన పంటల వివరాలు అడిగారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఘనాపురం ఆనకట్ట నుంచి చివరి ఆయకట్టు వరకు నీరు అందుతుందని తెలిపారు. ప్రస్తుతం వరి పంటలకు నీటి కొరత లేదన్నారు. రైతులకు సాగునీరు సరఫరాకు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నామని, నీటి నిర్వహణ, మోటార్లకు నిరంతర విద్యుత్ సరఫరా వంటి చర్యలు తీసుకొనేలా అధికారులను ఆదేశించామని తెలిపారు. అవసరం ఉన్న మేరకు మాత్రమే భూగర్భ జలాలు ఉపయోగించాలని, అందుకు వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకోవాలని సూచించారు. కాగా, చిలప్‌చెడ్ మండలం చండూర్ శివారులో ఎండిపోయిన పంటల వివరాలు అడిగారు. సుమారు 250 ఎకరాల వరకు ఎండిపోయినట్లు ఏఓ సమాధానమిచ్చారు. ఎత్తిపోతల ప్రాజెక్టు ఎందుకు పనిచేయడం లేదని, ఏ మరమ్మతులు చేయించాలో, పూర్తి సమాచారం అందించాలని ఏఓను ఆదేశించారు. రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆరుతడి పంటలు వేయాల్సిందని చెప్పారు. ఆయన వెంట ఏఈఓ కృష్ణవేణి ఉన్నారు.
విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తొద్దు
ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందుల తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కొల్చారం కళాశాల సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం కళాశాలను తనిఖీ చేసిన ఆయన పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై ఆరా తీశారు. నిర్దేశించిన సమయంలోగా విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతించాలని ఆదేశించారు. తాగునీటి వసతి, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచడం తప్పనిసరి అన్నారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్
చివరి ఆయకట్టు వరకుఘనాపురం నీరు