కుమురంభీం జిల్లా కౌటాల మండలానికి చెందిన ఓ వలస కూలీ పదేళ్ల క్రితం మంచిర్యాలకు వచ్చాడు. కొంతకాలం తర్వాత మద్యానికి బానిసయ్యాడు. మర్చిపోయేందుకు బట్టీల వద్ద లభించే తెల్లకల్లుకు అలవాటు పడి అనారోగ్యం పాలయ్యాడు. ఇంట్లో గొడవలు జరగడంతో కల్లు మానేశాడు. అప్పటి నుండి మతిస్థిమితం కోల్పోయి ఇంటివద్దే ఉంటున్నాడు.
జిల్లా కేంద్రంలోని భగవతం వాడకు చెందిన ఒకరు బట్టీల్లో విక్రయించే తెల్లకల్లుకు బానిసయ్యాడు. మానెయ్యాలని కొంతకాలంగా ఇంట్లో కట్టడి చేయడంతో మతిస్థిమితం కోల్పోయాడు. కల్లు సేవిస్తేనే బాగుంటాడు. లేనిరోజు పిచ్చిగా వ్యవహరిస్తున్నాడు. కాళ్లు, చేతులు లాగుతున్నాయని చెప్పేవాడు. మాన్పించేందుకు ఎంత ప్రయత్నం చేసినా మానక చివరికి మృతి చెందాడు.
మంచిర్యాలక్రైం: ప్రమాదకర రసాయనాలతో కృత్రిమంగా తయారైన కల్తీ కల్లు ప్రాణాంతకంగా మారి నిరుపేదల జీవితాల్లో చిచ్చుపెడుతోంది. జిల్లాలో రెండు లక్షలకు పైగా తాటి, ఈతచెట్లు ఉన్నట్లు రికార్డుల్లో ఉన్నా క్షేత్రస్థాయిలో అందులో 20 శాతం కూడా లేకపోవడం గమనార్హం. హైదరాబాద్‌కు చెందిన ఈగల్ టీం గురువారం రాత్రి మంచిర్యాలలోని తెల్లకల్లు బట్టీలపై ఆకస్మికంగా దాడులు నిర్వహించి ఆల్ఫ్రాజోలం వంటి ప్రమాదకర రసాయనాలతో కల్లు తయారు చేస్తున్నట్లు గుర్తించి నమూనాలు సేకరించారు. విక్రయదారులు, బట్టీల నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు కల్లు బట్టీలపై ఎకై ్సజ్ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేసిన దాఖలాలు లేకపోవడం గమనార్హం.
రసాయనాలతో కల్లు తయారీ..
గతేడాది ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్స్ సీఐ సమ్మయ్య ఆధ్వర్యంలో ఒకసారి దాడులు చేసి షాంపిల్స్ సేకరించి చేతులు దులుపుకున్నారనే ఆరోపనలు ఉన్నాయి. జిల్లాలోని పెద్దంపేట్, జన్నారం, ఇందన్‌పెల్లి, క వ్వాల, బాదంపెల్లి, నస్పూర్, నమ్నూర్, మంచిర్యా ల సమీపంలోని గోదావరి తీరంలో పెద్దంపేట, గోలివాడ ప్రాంతాల్లో కొంత మేరకు తాటిచెట్లు ఉన్నా అవి స్థానిక గ్రామ అవసరాలకే చాలని పరిస్థి తి. అయినా కల్లు సొసైటీ కాంట్రాక్టర్లు ‘చెప్పిందే చెట్టు.. వాళ్లు విక్రయించిందే కల్లు’ అన్నచందంగా మారింది. చెట్లు లేవంటే లైసెన్స్‌లు పోతాయనే ఉద్దేశంతో వ్యాపారులు కృత్రిమంగా కల్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. జిల్లాలో 3 తెల్లకల్లు బట్టీలు, 92కు పైగా సొసైటీలు ఉన్నాయి. సొసైటి సంఘాల (టీసీఎస్) ద్వారా నడిచే కల్లు దుకాణాలు 109, వ్యక్తిగతంగా గీత కార్మికులు విక్రయించే కల్లు దుకాణాలు (టీఎఫ్‌టీ)85 ఉన్నాయి. జిల్లాలో 318 మంది గీత కార్మికులు ఉన్నారు. సొసైటీల ద్వారా అమ్ముకునేందుకు కల్లు దొరకక పోవడంతో వివిధ రకాల రసాయనాలతో కృత్రిమంగా కల్లు తయారు చేసి విక్రయిస్తున్నారు.
బానిసైన వారి వింత ప్రవర్తన
రోజంతా పనిచేసిన కూలీలు అలసట తీర్చుకునేంద కు తెల్లకల్లు తాగుతుంటారు. వీరి బలహీనతను ఆ సరా చేసుకున్న బట్టీల నిర్వాహకులకు ప్రమాదకర రసాయనాలతో కల్లు తయారు చేసి విక్రయాలు సా గిస్తున్నారు. తెల్లకల్లుకు బానిసలుగా మారిన వారు కల్లు తాగకుండా ఉండలేరు. కల్లు తాగని రోజు వింతగా ప్రవర్తిస్తారు. కల్లు తాగడం మానేసిన తర్వాత వింత ప్రవర్తన మొదలవుతుంది. కాళ్లు, చేతులు లాగడం, నడవలేక పోవడం, కళ్లు తేలేయడం, మతిస్థిమితం తప్పి మాట్లాడడం, ఉన్నట్టుండి కిందపడిపోవడం వంటివి చేస్తుంటారు. మళ్లీ కల్లు తాగితేగానీ కోలుకోలేని పరిస్థితి ఎదురవుతుంది.


