ఆదిలాబాద్‌టౌన్: వివిధ రాష్ట్రాల్లో భారీ వాణిజ్య వాహనాల చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం పది మందిపై కేసు నమోదు చేయగా, ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో వివరాలు వెల్లడించారు. హైవేలు, పెట్రోల్ బంకుల వద్ద పార్క్ చేసిన ఐచర్, టిప్పర్ వంటి భారీ వాహనాలను లక్ష్యంగా చేసుకుని ముఠా చోరీలకు పాల్పడుతుందన్నారు. వాహనాల అద్దాలు పగులగొట్టి, స్టీరింగ్ లాక్ విరగ్గొట్టి, ఇగ్నిషన్ వైరింగ్ కట్ చేసి దొంగిలిస్తున్నట్లు పేర్కొన్నారు. వాహనాలను మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు తీసుకెళ్లి ఒక్కరోజులోనే విడిభాగాలుగా మార్చి విక్రయిస్తున్నట్లుగా గుర్తించామన్నారు. నిందితులపై మావల, గుడిహత్నూర్, శంషాబాద్ పోలీస్‌స్టేషన్లలో ఇప్పటికే పలు కేసులు నమోదైనట్లుగా తెలిపారు. ఇటీవల మావల బైపాస్ వద్ద వాహన తనిఖీల సమయంలో టయోటా ఏటీఎస్ కారులో వెళ్తున్న నిందితులను పోలీసులు అనుమానంతో ఆపగా పరారయ్యే ప్రయత్నం చేశారన్నారు. వారిని వెంబడించి హర్యానాకు చెందిన సలీం, నఫీస్‌ఖాన్, రాజస్థాన్‌కు చెందిన ఇంతాజ్ హుస్సేన్ అలియాస్ ఇంతియాజ్ అనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి టయోటా ఏటీఎస్ కారు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. అరెస్టు చేసిన నిందితులను కోర్టులో హాజరుపర్చగా జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతోందన్నారు. కేసును ఛేదించడంలో కీలకంగా పనిచేసిన సైబర్ సెల్, సాంకేతిక బృందం, మావల, ఆదిలాబాద్ రూరల్ పోలీసులు, సీసీఎస్ సిబ్బంది, మధ్యప్రదేశ్ పోలీస్ అధికారులను ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, సీఐలు ప్రేమ్ కుమార్, కె. ఫణిదర్, ఎస్సైలు విష్ణువర్ధన్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


