కిడ్నీ సమస్యతో బాధపడుతూ యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

కిడ్నీ సమస్యతో బాధపడుతూ యువకుడి ఆత్మహత్య

May 29 2026 2:37 AM | Updated on May 29 2026 2:37 AM

లక్సెట్టిపేట: మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన లింగంపల్లి అజయ్‌(19) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై గోపతి సురేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం అజయ్‌ గత కొన్ని సంవత్సరాల నుంచి కిడ్నీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నాడు. ఈక్రమంలో ఈనెల 26వ తేదీన ఇంటి ఆవరణలో పురుగులు మందు తాగగా గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి, మంచిర్యాలకు, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. అజయ్‌ తల్లి సువర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

పురుగుల మందు తాగి వివాహిత..

లక్సెట్టిపేట: మున్సిపాలిటీ పరిధి ఇటిక్యాల గ్రామానికి చెందిన వివాహిత మేడి దేవమ్మ(50) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై గోపతి సురేశ్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం దేవమ్మ భర్తకు రెండేళ్ల క్రితం పక్షవాతం రాగా మంచానికి పరిమితమయ్యాడు. అప్పటి నుంచి భర్తకు సేవలు చేస్తూ కుటుంబ సభ్యులతో కష్టాలు చెప్పుకుంటూ బాధపడుతుండేది. ఈక్రమంలో బుధవారం రాత్రి మనస్తాపానికి గురై పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందింది. ఆమెకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్దకుమారుడు సంతోష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

వీధి కుక్కల దాడిలో దూడ మృతి

బోథ్‌: మండల కేంద్రంలోని న్యూ కాలనీలో గురువారం వీధి కుక్కల దాడిలో అశోక్‌కు చెందిన దూడ హతమైంది. ఇంటి వద్ద ఉన్న దూడపై కుక్కలు దాడి చేశాయి. దీంతో దూడ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందింది. స్థానిక డంపింగ్‌ యార్డులో పేరుకుపోయిన మాంసం, ఇతర ఆహార వ్యర్థాలను తింటూ హింసాత్మకంగా మారిన కుక్కలు పశువులపై దాడులకు తెగబడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయన్నారు. అధికారులు స్పందించి వీధి కుక్కల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement