లక్ష్మణచాంద: అదృశ్యమైన యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన మండలంలోని చింతల్‌చాంద గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని చింతల్‌చాంద గ్రామానికి చెందిన రాజేశ్వర్ –ప్రమీల దంపతుల కవల పిల్లల్లో చిన్న కుమారుడు లక్ష్మణ్(18) ఈ నెల 26న ఉదయం 7 గంటల సమయంలో ఉపాధిహామీ పనుల వద్ద తల్లి ప్రమీలను బైక్‌పై దింపి వెళ్లాడు. మధ్యాహ్నం వరకు ఫోన్ రింగ్ కాగా సాయంత్రం స్విచ్‌ఆఫ్ వచ్చింది. కుమారుడు ఎక్కడకు వెళ్లాడో తెలియని ప్రమీల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మొబైల్ ట్రాక్ చేసిన పోలీసులు చింతల్‌చాంద గ్రామ సమీపంలోనే ఉన్నట్లు గుర్తించారు. గురువారం గ్రామ సమీపంలోని అడవికి తునికాకు సేకరణకు వెళ్లిన మహిళలకు మృతదేహం కనిపించడంతో గ్రామస్తులకు తెలిపారు. అనంతరం గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. లక్ష్మణ్ మృతి చెందిన తీరుపై అనుమానం ఉందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఎస్సై శ్రావణి, సోన్ సీఐ గోవర్ధన్ రెడ్డిలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రావణి తెలిపారు.


