మంచిర్యాలటౌన్: ఏటా వేసవిలో విద్యార్థులకు వారికి నచ్చిన క్రీడల్లో శిక్షణ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలంగా వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహిస్తోంది. ఏటా ఏప్రిల్ 24వ తేదీ నుంచి క్రీడా శిక్షణ శిబిరాలను ప్రారంభించి మే 31తో ముగిస్తారు. ఇందుకు సంబంధించిన క్రీడా సామాగ్రితో పాటు, కోచ్‌లకు కొంత వేతనాన్ని సైతం ప్రభుత్వమే అందిస్తూ వస్తోంది. కానీ గతేడాది నుంచి వేసవి క్రీడా శిబిరాలు గతి తప్పాయి. 14 ఏళ్లలోపు విద్యార్థులకు అందించే ఈ క్రీడా శిక్షణ గతేడాది, ఈ ఏడాది ఆలస్యంగా మే 1వ తేదీన ప్రారంభించారు. శిక్షణకు అవసరమైన క్రీడా పరికరాలు గతేడాది మే 20న రాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు ఇంకా అందలేదు. దీంతో కోచ్‌లు గతంలో వాడినవి, ప్రస్తుతం వారు ఇతర క్రీడాకారులకు అందిస్తున్న శిక్షణకు సంబంధించిన క్రీడా పరికరాలతోనే శిక్షణను నెట్టుకొస్తున్నారు. ఏటా పది రకాల క్రీడల్లో శిక్షణను ఇస్తుండగా, ప్రతీ క్రీడలో 30 మందికి పైగానే విద్యార్థులు శిక్షణ పొందేవారు. కానీ ఈ ఏడాది పదిలోపే విద్యార్థులు శిక్షణకు వస్తున్నారు.
కొత్త నిబంధనలతో ఇబ్బందిగా
వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణను గాలికొదిలేసిన ప్రభుత్వం, కొత్త నిబంధనలతో ఇబ్బందిగా మారుస్తోందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. క్రీడా శిక్షణ శిబిరానికి హాజరయ్యే విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలన్న నిబంధనతో విద్యార్థులకు ఇబ్బందిగా మారి, క్రీడా శిక్షణకు హాజరు కావడం లేదని తెలుస్తోంది. వేసవి క్రీడా శిబిరాలను గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో నిర్వహిస్తుండగా, అర్బన్ ప్రాంతంలో మాత్రం విద్యార్థుల నుంచి నామమాత్రపు ఫీజు అంటూ ఒక ధర నిర్ణయించారు. ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలో అర్బన్ క్యాంపులు 11 ఏర్పాటు చేయగా అథ్లెటిక్స్‌కు రూ.100, బాక్సింగ్ రూ.100, బాస్కెట్‌బాల్‌కు రూ.300, ఫుట్‌బాల్‌కు రూ.100, వాలీబాల్‌కు రూ. 100, కరాటేకు రూ.100, కబడ్డీకి రూ.100, బ్యాడ్మింటన్‌కు రూ.500, ఫుట్‌బాల్‌కు రూ.100 చొప్పున ఫీజు తీసుకుని శిక్షణ ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. కానీ మొక్కుబడిగా వస్తున్న విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయక పోవడంతో వేసవి క్రీడా శిబిరాల్లో ఎంతమంది శిక్షణ పొందుతున్నారనే వివరాలు అధికారికంగా లేవనే సాకుతో, వారికి రావాల్సిన క్రీడా పరికరాలను అందించడంలో ఆలస్యం చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే శిక్షణకు సంబంధించి దాదాపు 20 రోజులు పూర్తికావస్తుండగా, ఎప్పుడు క్రీడా పరికరాలు వస్తాయనే దానిపై స్పష్టత లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం, అధికారులు స్పందించి క్రీడా సామగ్రిని అందించడంతో పాటు, వేసవి క్రీడా శిక్షణ శిబిరాలపై దృష్టిసారిస్తే ఆసక్తి ఉన్న విద్యార్థులు వారికి నచ్చిన క్రీడల్లో శిక్షణ పొంది, వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
నిర్వహణపై కానరాని ఆసక్తి
వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి గతంలో విశేష స్పందన ఉండేది. విద్యార్థులు పోటీపడి మరీ శిక్షణకు హాజరయ్యేవారు. ప్రతీ శిబిరంలో 30కి పైగా విద్యార్థులు ఉండేవారు. విద్యార్థులకు అవసరమైన అల్పాహారం, పండ్లను సైతం పలు స్వచ్ఛంద సంస్థలు అందించేవి. శిక్షణ శిబిరాలన్నీ కూడా విద్యార్థులతో కిటకిటలాడేవి. గతేడాది నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలపై ప్రభుత్వం, అధికారులు ఆసక్తి చూపించడం లేదు. ఎంతో అట్టహాసంగా ప్రారంభం కావాల్సిన శిక్షణ శిబిరాలు, గతేడాది నుంచి కోచ్‌లే చడీ చప్పుడు లేకుండా ప్రారంభిస్తున్నారు. మౌలిక సదుపాయాలు లేకపోవడం, క్రీడా పరికరాలు అందక పోవడంతో కోచ్‌లు సైతం ఆయా శిబిరాలకు చిన్నారులు వచ్చేలా చేయడం లేదు. ప్రతీ సంవత్సరం విద్యార్థులకు 50 రోజుల పాటు వేసవి సెలవులు వస్తే, వేసవి క్రీడా శిబిరాలతో వారిలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకునే ఒక చక్కటి అవకాశాన్ని కోల్పోతున్నారు. కొందరు విద్యార్థులు మాత్రం పలు అసోసియేషన్లు అందించే శిక్షణకు ఫీజులు చెల్లించి నేర్చుకోవాల్సి వస్తోంది.


