మంచిర్యాలఅర్బన్: మంచిర్యాల బస్‌స్టేషన్ విస్తరణలో జాప్యంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్‌లో రద్దీ ఎక్కువగా ఉండడంతో కొన్నిసార్లు కూర్చునే సౌకర్యం కూడా లేకపోవడం, స్థలం సరిపోక బస్సులు ఆలస్యం కావడం జరుగుతోంది. అంతేకాకుండా ప్లాట్‌ఫాం లేక బస్సులు ఎక్కడికక్కడ నిలిపివేయడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ప్రస్తుతం డిపోకు ఉన్న కొద్దిపాటి స్థలాన్ని సద్వినియోగం చేసుకునేలా కసరత్తు జరిగింది. మంచిర్యాల డిపో స్థలాన్ని (ప్రహరీని కొంతమేర పక్కకు జరిపి) బస్‌స్టేషన్ విస్తరించేందుకు అధికారులు పంపిన ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. గతేడాది మే నెలలో బస్‌స్టేషన్ విస్తరణ పనులు చేపడతారనే కూడా ప్రచారం జరిగినా ఆపై పనులు అటకెక్కాయి.
విస్తరణపై పట్టింపేది?
మంచిర్యాల బస్‌స్టేషన్ విస్తరణలో భాగంగా డిపో ను వేరేచోటకు తరలించేందుకు అధికారులు ప్రతి పాదనలు తయారుచేసి ఉన్నతాధికారులకు నివేదించారు. క్వారీ రోడ్, నస్పూర్ మెయిన్ రోడ్‌తో పాటు పలుచోట్ల బస్‌డిపో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వెంపల్లిలో ఆర్టీసీ అధికారులు స్థల పరిశీలన చేశారు. ఆ తర్వాత కాలంలో డిపో ప్రస్తావన మరుగున పడింది. డిపో తరలింపునకు ముందుగా గతేడాది బస్‌స్టేషన్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వ చ్చినా పనులు మాత్రం ముందుకు సాగలేదు. బస్ డిపో ప్రహరీని 12 నుంచి 13 ఫీట్ల మేర వెనక్కి జరిపేందుకు నిర్ణయించారు. ప్రస్తుతం డిపోలో ఉన్న స్కూటర్ షెడ్‌ను వెనకవైపు ఏర్పాటు చేయనున్నారు. నిర్మల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన మరుగుదొడ్డి, సెక్యూరిటీ రూంలు మాత్రం యధావిధిగానే ఉంచనున్నట్లు తెలుస్తోంది. మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన టారయిలెట్లను అక్కడి నుంచి తొలగించాల్సిన అవసరం ఉంది. వాహనాల స్టాండ్‌ను అక్కడి నుంచి తొలగించి ఆస్పత్రి వెనకవైపు ఉన్న ఖాళీస్థలానికి మార్చేందుకు ప్రతిపాదనలు రెడీ చే శారు. నెలలోపు ప్రహరీ తొలగింపు పనులు చేపడుతారని హడావుడి సాగినా మళ్లీ మొదటికి వచ్చింది.
51 ఏళ్లు గడిచినా మెరుగుపడని సౌకర్యాలు
32 బస్సులు, తొమ్మిది ప్లాట్‌ఫాంలతో 1975, ఫిబ్రవరి 6న మంచిర్యాల బస్‌స్టేషన్ ఏర్పాటు చేశారు. 3.21 ఎకరాల్లో డిపో, 1.34 ఎకరాల్లో బస్‌స్టేషన్ నిర్మించారు. ప్రస్తుతం డిపో పరిధిలో 148 బస్సులున్నాయి. ఇందులో 69 అద్దె బస్సులు ఉన్నాయి. మంచిర్యాల బస్‌స్టేషన్ మీదుగా రోజుకు 62 వేల కిలోమీటర్ల మేర బస్సులు నడపటం ద్వారా రూ.34 నుంచి 36 లక్షల(మహలక్ష్మీ పథకం కలుపుకుని) ఆదాయం సమకూరుతోంది. ఇందిరా మహిళా శక్తి కొత్త బస్సులు కూడా రానున్నాయి. బస్సులు పెరుగనుండడంతో మరింత ఇబ్బంది తప్పేలా లేదు. ప్రయాణికుల సంఖ్య, బస్సులు పెరిగినా ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో మాత్రం సౌకర్యాలు మెరుగుపడడం లేదు.


