సర్కారు విద్యార్థులకు వర్క్‌బుక్స్‌ | - | Sakshi
Sakshi News home page

సర్కారు విద్యార్థులకు వర్క్‌బుక్స్‌

May 18 2026 10:07 AM | Updated on May 18 2026 10:07 AM

మంచిర్యాలఅర్బన్‌: సర్కారు బడిలో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌ అందజేస్తున్న ప్రభుత్వం వర్క్‌బుక్స్‌ కూడా అందించాలని నిర్ణయించింది. విద్యార్థులకు ప్రాక్టీస్‌, రివిజన్‌, పరీక్షలకు సిద్ధంకావడానికి ఇవి చాలా ఉపయోగపడుతాయి. పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించేందుకు దోహదపడతాయి. 2026–27 విద్యా సంవత్సరంలో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు వర్క్‌బుక్స్‌ పంపిణీకి కసరత్తు పూర్తి చేశారు. జిల్లాలోని 814 పాఠశాలల్లో 60,943 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ వర్క్‌బుక్స్‌ ఉపయోగపడనున్నాయి.

పంపిణీ ఇలా..

గతంలో ఒకటి నుంచి ఐదోతరగతి వరకు వర్క్‌బుక్స్‌ ఉచితంగా ఇచ్చేవారు. ప్రస్తుతం ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు కూడా ఉచితంగా వర్క్‌బుక్స్‌ (అభ్యాస పుస్తకాలు) తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ మాద్యమాల్లో పంపిణీ చేయనున్నారు. ప్రతీ పాఠం చివరన ఉండే అవగాహన–ప్రతిస్పందన, వ్యక్తీకరణ, సృజనాత్మకత ప్రశ్నలకు సులువైన సమాధానాలుంటాయి. పాఠ్యపుస్తకాల బోధన తర్వాత విద్యార్థులకు పుష్కలమైన సాధన, అధ్యాయం ముగిశాక రివిజన్‌ వర్క్‌షీట్లు ఉంటాయి. ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లు, గురుకులాల విద్యార్థులకు జూన్‌ నెలాఖారుకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది.

Advertisement
 
Advertisement
Advertisement