జన్నారం: వేసవి సెలవుల్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కూచిపూడి నృత్యం నేర్చుకునేందుకు కొందరు విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. సెలవులను సద్వినియోగం చేసుకుంటూ ప్రతిరోజూ నిత్య సాధనతో మువ్వల సవ్వడి చేస్తున్నారు. జన్నారం మండల కేంద్రంలో మొదట 10 మంది ఉన్న నటరాజ కళాక్షేత్రం డ్యాన్స్ క్లాస్‌లో ప్రస్తుతం 30 మంది వరకు చేరారు. ఇంకా పిల్లలు శిక్షణకు వచ్చే అవకాశం ఉందని మాస్టర్ నర్మదగౌడ్ తెలిపారు.
సంప్రదాయానికి పట్టాభిషేకం
ఆధునిక పోకడలు, వెస్ట్రన్ డ్యాన్స్ క్లాసులు ఎన్ని ఉన్నా కూచిపూడి నృత్యానికి ఉన్న క్రేజ్ అస్సలు తగ్గలేదని ఈ వేసవి శిక్షణ శిబిరాలు నిరూపిస్తున్నాయి. 5 ఏళ్ల చిన్నారుల నుంచి కాలేజీ విద్యార్థుల వరకు, సాయంత్రం వేళల్లో నృత్య అకాడమీల్లో సాధన చేస్తున్నారు.
పాద విన్యాసాలు –హావభావాలు..
కూచిపూడిలోని ప్రాథమికాంశాలైన అడుగులు (చతురస్ర, తిస్ర గతులు), హస్త ముద్రలు, ముఖంలో నవరసాలను పలికించే హావభావాలపై నృత్య మాస్టర్ నర్మదగౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. సంప్రదాయ నృత్యమైన కూచిపూడిలో మెలకువలు నేర్పిస్తున్నారు. పిల్లలు కంప్యూటర్, మొబైల్ ఫోన్‌లకు పరిమితం కాకుండా తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను డ్యాన్స్ క్లాసులకు పంపిస్తున్నారు.
స్నేహితురాలి సాయంతో
సైకిల్ నేర్చుకుంటున్న చిన్నారి


